Delhi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ తో ఫోన్లో మాట్లాడారు. ట్రంప్ తొలి దశ పాలన సమయంలో.. ఆయనకు మోదీ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ జ్ఞాపకాలను మోదీ నెమరేసుకున్నారు. భారత్, అమెరికా మధ్య ఉన్న వాణిజ్య బంధాన్ని గుర్తు చేశారు. 2019 సెప్టెంబర్‌లో హూస్టన్‌లో జరిగిన హౌడీ మోడీ ఈవెంట్‌ను కూడా ప్రధాని మోదీ గుర్తు చేశారు. 2020 ఫిబ్రవరిలో నమస్తే ట్రంప్ పేరుతో అహ్మదాబాద్‌లో కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే.
అమెరికా, భారత్ మద్య వూహాత్మక భాగస్వామ్యం గురించి మాట్లాడారు. టెక్నాలజీ, రక్షణ, ఎనర్జీ, అంతరిక్ష రంగాలతో పాటు ఇతర రంగాల్లోనూ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు ఇద్దరూ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఎక్స్ లో తెలిపారు.
కాగా,రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించడం తెలిసిందే. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ పై ఆయన గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్ 270ని దాటడంతో ట్రంప్ గెలుపు ఖరారైంది.
కీలకమైన స్వింగ్ రాష్ట్రాల్లో (ఇరు పార్టీలకు సమాన బలం ఉండే రాష్ట్రాలు) ట్రంప్ దే పైచేయి అయింది. ట్రంప్ కు 277 ఎలక్టోరల్ ఓట్లు రాగా, కమలా హారిస్ 224 ఓట్లు సాధించారు.

