PM Kisan: తెలంగాణ రైతులకు మరో శుభవార్త అందింది. ఇప్పటికే రైతుభరోసా నిధులు ఖాతాల్లో జమకావడంతో మురిసిపోతున్న రాష్ట్ర రైతాంగాన్ని పీఎం కిసాన్ నిధులతో మరో తీపివార్త అందనున్నది. ఈ మేరకు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మహూర్తం ఖారారు చేసినట్టు తెలుస్తున్నది. వాస్తవంగా 2025 జూన్ 20వ తేదీన పీఎం కిసాన్ 20వ విడత నిధులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం తొలుత నిర్ణయించినా, ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన విడుదల చేయకపోవడంతో రైతుల్లో ఉత్కంఠ నెలకొన్నది.
PM Kisan: పీఎం కిసాన్ 19వ విడత నిధులు 2025 ఫిబ్రవరి 24వ తేదీన రైతుల ఖాతాల్లో రూ.2,000 చొప్పన నగదు జమ అయ్యాయి. అదే విధంగా జూన్ 20న మరో 2,000 నగదును జమ చేసేందుకు కేంద్ర వ్యవసాయ వర్గాలు ముందస్తు ప్లాన్ చేశాయి. అయితే ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా ఇప్పటి వరకూ ప్లాన్ చేయలేదని ఆ వర్గాలు తెలిపాయి. త్వరలో ప్రధాని వస్తారని, 20వ తేదీ నుంచి 24వ తేదీ లోగా పీఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
PM Kisan: గత 19వ విడత 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2,000 చొప్పున రూ.22,000 కోట్ల నగదును కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. 20వ విడత కూడా అంతే మొత్తంలో నగదును రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధంగా ఉన్నది. రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేసి ఉండాలని, బ్యాంకు ఖాతా నంబర్‌కు ఆధార్ నంబర్ అనుసంధానమై ఉంటేనే పీఎం కిసాన్ నగదు జమ అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ రెండు చేయించకుంటే నగదు జమకాదని తేల్చి చెప్తున్నారు.