TTD: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఓ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. ఆలయాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చే లక్ష్యంలో భాగంగా, భక్తులు ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తే వారికి ప్రోత్సాహకంగా డబ్బులు ఇవ్వనుంది.
ప్లాస్టిక్ వ్యర్థాలకు డబ్బులు
తిరుమల యాత్రికుల వసతి సముదాయంలో ప్రయోగాత్మకంగా ఓ ప్లాస్టిక్ రీసైక్లింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ యంత్రంలో భక్తులు ఉపయోగించిన ప్లాస్టిక్ సీసాలు, ఇతర వ్యర్థాలు వేస్తే, వారికి ప్రోత్సాహకంగా రూ. 5 చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని నేరుగా భక్తుల యూపీఐ ఖాతాలోకి పంపేలా ఏర్పాట్లు చేశారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సులభంగా డబ్బులు పొందవచ్చు.
పర్యావరణ పరిరక్షణకు మరో అడుగు
గతంలో చార్ ధామ్ యాత్రలో కూడా ఇలాంటి యంత్రాలను ఏర్పాటు చేశారు. నదులలో ప్లాస్టిక్ వ్యర్థాలు పడకుండా ఈ యంత్రాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇప్పుడు టీటీడీ కూడా ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా ప్లాస్టిక్ రహిత సమాజం దిశగా మరో అడుగు వేసింది. ఈ నిర్ణయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రశంసించారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఈ యంత్రాన్ని పరిశీలించి, భక్తులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ వినూత్న కార్యక్రమం వల్ల భక్తులు పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగస్వాములవుతారని టీటీడీ ఆశిస్తోంది.