AP news: సంక్రాంతి సీజన్ అంటే ఏపీ కోస్తా జిల్లాల్లో పండుగ శోభతో పాటు కోడిపందాల సందడి కనిపించడం సహజం. భోగి, సంక్రాంతి, కనుమ మూడ్రోజుల పాటు ఇళ్లలో పండుగ చైతన్యం ఉప్పొంగుతుంటే, గ్రామాల శివార్లలో కోడిపందాల హోరాహోరీ పోటీలు జరుగుతుంటాయి. కానీ, ఈసారి ఈ సంబరాలకు మరో విశేషం చేరింది. పందుల పందాలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
తాడేపల్లిగూడెం మండలంలోని కుంచనపల్లి గ్రామం ఇటీవల పందుల పందాలకు వేదికగా మారింది. ఇక్కడ స్థానికంగా ఉన్న దేశవాళీ పందులు, సీమ పందులు వంటి వివిధ జాతుల పందులను బరిలో దించి పోటీలు నిర్వహించారు. బరిలో దిగి ఆ పందులు పోరాట పటిమను చూపించగా, పోటీలు చూసేందుకు వచ్చిన ప్రజలు ఉత్సాహంగా ఆనందించారు.
ఈ పందుల పందాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా పాపులర్ అవుతున్నాయి. అయితే, పందుల పోటీలు నిర్వహించడం తమ ప్రాంతీయ సంప్రదాయంలో భాగమని, ఇది తరతరాలుగా వస్తున్న ఆచారమని నిర్వాహకులు తెలిపారు. సంక్రాంతి పండుగలో ఈ కొత్త ఆకర్షణకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది.