ICC Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి ముందు జెండా వివాదం వచ్చింది. ఈ వివాదంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి స్పందించింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీరును బీసీసీఐ తప్పుబడుతూ…. ఇతర జట్ల జెండాలతో పాటు భారత జెండాను కూడా ఎగరవేయాలని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా డిమాండ్ చేశారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్, ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభానికి ముందు వివాదంలో చిక్కుకుంది. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే దేశాల జెండాలను కరాచీ స్టేడియం మరియు లాహోర్‌లోని గడాఫీ స్టేడియం పైకప్పుపై ఎగరవేసిన పీసీబీ, భారత త్రివర్ణ జెండాను మాత్రం ఎగురవేయలేదు. ఈ సంబంధిత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక, భారత అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పీసీబీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పాకిస్థాన్ తన నీచత్వాన్ని బయటపెట్టుకుందని భారత అభిమానులు మండిపడ్డారు.
ఈ టోర్నమెంట్ కోసం భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించకపోవడంతోనే పీసీబీ భారత జెండాను ఎగరవేయలేదని పాకిస్థాన్ నెటిజన్లు మరియు జర్నలిస్ట్‌లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ వివాదంపై పీసీబీ కూడా స్పందించింది. “ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడేందుకు భారత్ పాకిస్థాన్‌కు రావడం లేదు. కరాచీ, రావల్పిండి, లాహోర్ స్టేడియాల్లో మ్యాచ్‌లు ఆడుతున్న జట్ల జెండాలను మాత్రమే ఎగరవేశాం. భారత్ తన మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. బంగ్లాదేశ్ కూడా ఇంకా పాకిస్థాన్‌కు రాలేదు. ఆ జట్టు తమ తొలి మ్యాచ్‌ను భారత్‌తో ఆడనుంది. కాబట్టి భారత్ మరియు బంగ్లాదేశ్ జెండాలను ఇంకా ఎగరవేయలేదు. పాకిస్థాన్‌కు వచ్చిన ఇతర జట్ల జాతీయ జెండాలను మాత్రమే ఎగరవేసాం. ఈ జెండాల గురించి పీసీబీ అధికారికంగా స్పందించాల్సిన అవసరం లేదు,” అని పీసీబీ వర్గాలు మీడియాకు తెలిపాయి.
ఇది కూడా చదవండి: MIW Vs GGTW: బోణీ కొట్టిన ముంబై.. 5 వికెట్లతో సూపర్ విక్టరీ..! ఘోరంగా విఫలమైన గుజరాత్
ఈ వివాదంపై తాజాగా ఒక జాతీయ ఛానెల్‌తో మాట్లాడిన రాజీవ్ శుక్లా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీరును తప్పుబట్టారు. ముందుగా అక్కడ భారత జెండా ఉందో లేదో నిర్ధారించుకోవాలి. ఒకవేళ లేకుంటే, భారత జెండా పెట్టాల్సిందే. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే అన్ని జట్ల జాతీయ జెండాలను ఎగరవేయాలి అని రాజీవ్ శుక్లా తెలిపారు. ఆటగాళ్ల భద్రతను కారణంగా చూపిస్తూ, పాకిస్థాన్‌లో పర్యటించేందుకు బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనితో ఈ టోర్నమెంట్‌ను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించేలా పీసీబీని ఐసీసీ ఒప్పించింది.
ఇందుకుగాను బీసీసీఐ మరియు పీసీబీ మధ్య ఒక ఒప్పందం జరిగింది. భారత్ వేదికగా జరిగే ఐసీసీ టోర్నమెంట్‌లలో కూడా తమ మ్యాచ్‌లను తటస్థ వేదికలోనే నిర్వహించాలని పీసీబీ కోరగా, బీసీసీఐ అంగీకరించింది. అంతేకాకుండా, నష్టపరిహారంగా పీసీబీకి ఐసీసీ ఒక మెగా టోర్నమెంట్‌ను కూడా కేటాయించింది. టోర్నమెంట్ నిర్వహణ బడ్జెట్‌ను కూడా పెంచింది. దీనితో భారత్ మ్యాచ్‌లను దుబాయ్ వేదికగా నిర్వహించేందుకు పీసీబీ ఒప్పుకుంది. బుధవారం ఈ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. మరి పాకిస్తాన్ లో జరిగే మ్యాచ్ లకు ఇకనైనా భారత జెండా ఎగరవేస్తారా లేదా పంతానికి పోయి పాకిస్తాన్ బోర్డు కఠినంగా వ్యవహరిస్తుందా అన్న విషయంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.