Gold Scam: ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం ఒక చిన్న గ్రామంలో బంగారం పేరుతో పెద్ద మోసం జరిగిన విషయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. “నెలకు మూడు వేలే కట్టండి, పది నెలల తర్వాత ఎనిమిది గ్రాముల బంగారం పొందండి” అనే ఆకర్షణీయమైన స్కీమ్‌తో వందలాది గ్రామస్తుల విశ్వాసాన్ని గెలుచుకున్న చిన్నం దుర్గారావు, చివరికి వారినే రోడ్డున పడేశాడు.
దశాబ్దాలుగా గ్రామంలో ఉంటూ మంచి పేరు సంపాదించుకున్న దుర్గారావు, ఈ విశ్వాసాన్ని సద్వినియోగం చేసుకుని బంగారం స్కీమ్ పేరుతో కోట్ల రూపాయలు సేకరించాడు. మొదట్లో కొన్ని నెలలు క్రమంగా చెల్లింపులు చేస్తూ ప్రజల నమ్మకాన్ని మరింత బలపరిచాడు. అయితే బంగారం ధరలు ఒక్కసారిగా పెరగడంతో స్కీమ్ కూలిపోవడం మొదలైంది.
ఇది కూడా చదవండి: Horoscope Today: ఈ రాశి వారికి జాక్ పాట్ తగిలినట్టే.. మీ సహాయం కోసం జనాలు వెతుక్కుంటూ వస్తారు
తులం ధర 60 వేల నుండి లక్షకు పైగా పెరగడంతో, దుర్గారావు ఇచ్చిన హామీ అమలు కావడం అసాధ్యమైపోయింది. డబ్బులు ఇవ్వలేక, బంగారం ఇవ్వలేక చివరికి ఆయన పరారయ్యాడు. తన కష్టార్జిత సంపాదనను వందలాది మంది కోల్పోయి కన్నీటిలో మునిగిపోయారు.
“మేము నెల నెలా మూడు వేలే కడతామని భావించాం. దాచుకున్నట్టే అనిపించింది. కానీ ఇప్పుడు ఆ డబ్బు అంతా పోయింది” అంటూ బాధితులు వాపోతున్నారు. ఈ ఘటనతో పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ బాధితులతో కిక్కిరిసి పోయింది. ఇప్పటికే 70 మందికి పైగా ఫిర్యాదులు నమోదు కాగా, కొందరు కోర్టును కూడా ఆశ్రయించారు.
ఒత్తిడి పెరగడంతో, చివరికి దుర్గారావు జగ్గయ్యపేట సర్కిల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అయితే ఆయన చేతిలో ఉన్న డబ్బు ఎక్కడుంది? ప్రజల సొమ్ము తిరిగి వస్తుందా? అనే ప్రశ్నలకు ఇంకా సమాధానాలు దొరకలేదు.