Pawan Kalyan: ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ప్రజల కష్టాలను తీర్చడానికి కంకణం కట్టుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకాశం జిల్లా నరసింహపురంలో తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసి, జిల్లా ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చే దిశగా అడుగులు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ నిర్లక్ష్యం, రౌడీయిజం, గూండాయిజం వల్ల ప్రజలు పడిన ఇబ్బందులను గుర్తుచేసుకుంటూ, ఇప్పుడు తాము ప్రజా పాలన అందిస్తామని స్పష్టం చేశారు.
ప్రకాశం జిల్లాలో అపారమైన ఖనిజ వనరులు ఉన్నప్పటికీ, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని పవన్ కల్యాణ్ అన్నారు. ముఖ్యంగా, తాగునీటి సమస్య జిల్లాను తీవ్రంగా వేధిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టును పట్టించుకోలేదని, దానికి రూ.4 వేల కోట్లు అవసరమని, అలాగే జల్ జీవన్ మిషన్ పథకాన్ని కూడా నిర్లక్ష్యం చేసిందని ఆయన ఆరోపించారు. కేంద్రం జల్ జీవన్ మిషన్ ఆపేస్తున్నామని చెప్పినప్పుడు, తాను వెంటనే కేంద్రమంత్రి పాటిల్‌ను కలిసి రాష్ట్ర సమస్యలను వివరించినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. నీటి ఎద్దడి ప్రాంతాలకు రూ.84 వేల కోట్లు అవసరమవుతాయని కేంద్రానికి చెప్పామని, ఇప్పుడు మొదటి విడతగా రూ.1,290 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించామని ఆయన అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లాలో చేపట్టిన అతిపెద్ద తాగునీటి పథకం ఇదేనని, దీని ద్వారా దాదాపు 10 లక్షల మందికి పైగా ప్రజలకు తాగునీరు అందుతుందని పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. సకాలంలో నిధులు వస్తే, 18 నుంచి 20 నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని, తాను స్వయంగా ఈ పథకాన్ని పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు.
పారిశ్రామికీకరణ జరిగితే యువతకు, ఆడపిల్లలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. పారిశ్రామికీకరణకు ముందు నీటి సదుపాయం మెండుగా ఉండాలని ఆయన అన్నారు. గత ప్రభుత్వం రూ.లక్షల కోట్లు అప్పులు పెట్టిందని, వాటన్నింటినీ తట్టుకుని తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పారు.
Pawan Kalyan: అదేవిధంగా, దేవాలయాల భూముల జోలికి వస్తే ఊరుకోబోమని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భూదోపిడీ హద్దులు దాటేసిందని, ఎక్కడ ఖాళీ భూములు కనబడితే వాటిని దోచేశారని ఆయన ఆరోపించారు. ఆక్రమణలకు గురైన ఆలయాల భూములను వెనక్కి తీసుకునే ప్రక్రియను ప్రారంభించామని, వాటికి రక్షణ కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని ఆయన స్పష్టం చేశారు.
‘2029లో వస్తే మీ అంతు చూస్తామంటే, మీరు రావాలి కదా? మీరు ఎలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం’ అంటూ వైసీపీ నేతలకు పవన్ కల్యాణ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. సగటు మనిషిని బెదిరించడం వల్లే వైసీపీకి ఈ పరిస్థితి వచ్చిందని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వం అద్భుతంగా పాలన చేస్తే, వారికి 11 సీట్లు వచ్చేవి కాదని పవన్ అన్నారు. తాము సినిమా డైలాగులు చెప్పమని, కక్షసాధింపులకు దిగే ప్రభుత్వం కాదని, తప్పు చేస్తే శిక్షించే ప్రభుత్వమని ఆయన తేల్చిచెప్పారు. తాటాకు చప్పుళ్లకు తాము భయపడబోమని, ప్రజల ఆశీర్వాదంతోనే ఇంత బలంగా అధికారంలోకి వచ్చామని పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డోలా బాలవీరాంజనేయస్వామి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.