Tragedy: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు.. కన్నవారి కలలను నిజం చేస్తూ కొద్ది వారాల క్రితమే చేతికి పట్టా అందుకున్నాడు. అంతా సంతోషంగా సాగిపోతుందనుకున్న తరుణంలో విధి ఆ కుటుంబంపై పగబట్టింది. మునిగిపోతున్న ముగ్గురు స్నేహితుల ప్రాణాలను కాపాడే క్రమంలో.. ఆ తెలుగు విద్యార్థి తన ప్రాణాలనే పణంగా పెట్టి కన్నుమూశాడు. టెక్సాస్-లూసియానా సరిహద్దుల్లో ఉన్న టోలెడో బెండ్ రిజర్వాయర్‌లో మే 29న జరిగిన ఈ ఘోర ప్రమాదం ప్రవాస భారతీయులలో తీవ్ర విషాదాన్ని నింపింది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన అనురూప్ రెడ్డి కోడూరు (22), టెక్సాస్‌లోని డెంటన్ నగరంలో ఉంటూ ‘యూనివర్శిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్’ లో చదువు పూర్తి చేసుకున్నాడు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన సంతోషంలో స్నేహితులతో కలిసి టోలెడో బెండ్ డ్యామ్ సమీపంలోని స్పిల్‌వే వద్దకు విహారయాత్రకు వెళ్లాడు.
ముగ్గురిని ఒడ్డుకు చేర్చాడు.. కానీ విధి ఆడిన వింత నాటకం!
అనురూప్ ఈతలో చాలా మంచి నైపుణ్యం ఉన్నవాడు. అక్కడ స్నేహితులతో గడుపుతున్న సమయంలో ఊహించని విధంగా ముగ్గురు మిత్రులు నీటి ప్రవాహంలో చిక్కుకుని మునిగిపోవడం ప్రారంభించారు. అది చూసి ఏమాత్రం ఆలోచించకుండా, తన ప్రాణాల గురించి పట్టించుకోకుండా అనురూప్ నీటిలోకి దూకాడు. ఒక్కొక్కరిగా ముగ్గురు స్నేహితులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చి ప్రాణదాతగా నిలిచాడు.
అయితే, అందరినీ కాపాడి తాను ఒడ్డుకు వస్తున్న తరుణంలో నీటి అడుగున ఉన్న ఒక పాత చేపల వేట వైరు (Fishing Wire) అనురూప్ కాళ్లకు గట్టిగా చుట్టుకుపోయింది. ఈతలో ఎంత నిపుణుడైనప్పటికీ, ఆ వైరు బంధం నుండి అతను బయటపడలేకపోయాడు. దానికి తోడు నీటి లోపలి ఉధృతి (Underwater Current) అతడిని లోపలికి లాగేయడంతో.. సుమారు 20 అడుగుల లోతుకు వెళ్లి ఊపిరాడక నీటిలోనే ప్రాణాలు వదిలాడు.
20 అడుగుల లోతులో లభ్యమైన మృతదేహం
సమాచారం అందుకున్న సబైన్ పారిష్ షెరీఫ్ ఆఫీస్, లూసియానా డిపార్ట్‌మెంట్ ఆఫ్ వైల్డ్‌లైఫ్ అండ్ ఫిషరీస్ ఇంకా స్థానిక రెస్క్యూ టీమ్‌లు భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. చివరకు 20 అడుగుల లోతు నుండి అనురూప్ ప్రాణము లేని దేహాన్ని బయటకు తీశారు. స్నేహితుల కోసం అత్యున్నత త్యాగం చేసిన ఈ యువకుడి మృతి పట్ల స్థానిక అధికారులు తీవ్ర సంతాపం ప్రకటించారు. ఇటీవలి కాలంలో విదేశాలకు వెళ్లిన తెలుగు విద్యార్థులు ఇలాంటి దురదృష్టకర ప్రమాదాల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతుండటం కలచివేస్తోంది.
మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి విరాళాల సేకరణ
ఈ ఊహించని దారుణంతో నల్గొండలోని అనురూప్ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. చేతికి అందివచ్చిన కొడుకు శవమై వస్తున్నాడనే నిజాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. అమెరికా నుండి అనురూప్ భౌతికకాయాన్ని భారతదేశానికి తీసుకురావడానికి, ఇక్కడ అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి అతని సోదరుడు ఆశ్రిత్ రెడ్డి కోడూరు ఆన్‌లైన్‌లో ఫండ్‌రైజర్ (GoFundMe) ప్రారంభించాడు. అంతర్జాతీయంగా మృతదేహాన్ని తరలించడానికి భారీగా ఖర్చవుతుందని, దయచేసి ప్రతి ఒక్కరూ మానవత్వంతో సాయం చేయాలని కుటుంబ సభ్యులు నెటిజన్లను వేడుకుంటున్నారు.
