KTR: కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా సీఎం రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “ముఖం బాగోలేక అద్దం పగులగొట్టుకున్నట్లుగా.. రేవంత్ రెడ్డికి పాలన చేతకాక కేసీఆర్‌పై పడి ఏడుస్తున్నారు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జరిగిన కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యేలు సాయన్న, లాస్య నందిత చిత్రపటాలకు నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
కేసీఆర్ అప్పులతో అద్భుత ప్రగతి.. ఇవీ వాస్తవాలు!
కేసీఆర్ హయాంలో చేసిన అప్పులతో రాష్ట్రాన్ని ఎలా తీర్చిదిద్దారో కేటీఆర్ గణాంకాలతో సహా వివరించారు:
-
డబుల్ బెడ్రూం ఇండ్లు: కేసీఆర్ తెచ్చిన అప్పులతో రాష్ట్రంలో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించారు.
-
రైతు సంక్షేమం: ‘రైతుబంధు’ కింద రూ.73 వేల కోట్లు, రెండు విడతల్లో ‘రైతు రుణమాఫీ’ కింద రూ.30 వేల కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో వేశారు.
-
విద్యుత్, తాగునీరు: రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీరు అందించారు.
-
వైద్యం, విద్య: జిల్లాకో మెడికల్ ఇంకా నర్సింగ్ కాలేజీలు నిర్మించి, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు డాక్టర్లు అయ్యే అవకాశం కల్పించారు.
-
వ్యవసాయ విప్లవం: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు నీరిచ్చారు. ‘మిషన్ కాకతీయ’ కింద 45 వేల చెరువులను బాగు చేసి, తెలంగాణను దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెచ్చారు.
-
సామాజిక భద్రత: 15 లక్షల మంది ఆడబిడ్డలకు ‘కల్యాణలక్ష్మి’, మరో 15 లక్షల మందికి ‘ కేసీఆర్ కిట్‌లు’ అందించారు. రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.2 వేలకు పెంచారు.
రేవంత్ రెడ్డి రూ.4 లక్షల కోట్ల అప్పులతో ఏం చేశారు?
గడిచిన రెండున్నరేళ్ల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి సాధించిందేమిటని కేటీఆర్ ప్రశ్నించారు. “చెప్పింది చేయరు.. చేసేది చెప్పరు” అంటూ రేవంత్ మార్క్ పాలనపై మండిపడ్డారు:
కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇచ్చారా? వృద్ధులకు రూ.4 వేల పింఛన్ ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ఆడబిడ్డలకు స్కూటీలు రాలేదు కానీ, రాష్ట్రంలో మాత్రం దోపిడీ (లూటీ) జరుగుతోందని ఆరోపించారు. నిరుద్యోగులకు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని నిలదీశారు. “మేం కట్టిన ఇళ్లకు, మేం చేసిన పనులకు రేవంత్ రెడ్డి కేవలం రిబ్బన్లు మాత్రమే కట్ చేస్తున్నారు” అని ఎద్దేవా చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల సమయంలో మంత్రి పొంగులేటి వచ్చి 6 వేల ఇళ్లు ఇస్తామన్నారని, కనీసం 6 ఇళ్లయినా కట్టారా? అని నిలదీశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతుబంధు రావడం లేదు కానీ, ఢిల్లీకి మూటలు పంపేందుకు ‘రాహుల్ బంధు’ మాత్రం జోరుగా నడుస్తోందని ఆరోపించారు.
రైతు డిస్కం కాదు.. రైతును చంపే డిస్కం!
ప్రభుత్వం కొత్తగా తీసుకురావాలనుకుంటున్న ‘రైతు డిస్కం’ ప్రతిపాదనపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కాకముందు రైతులకు 3 గంటల కరెంట్ చాలన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు రైతు డిస్కం పేరుతో ఉచిత విద్యుత్‌కు ఎగనామం పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో, రైతులపై రేవంత్‌కు అంతే ప్రేమ ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇది ‘రైతు డిస్కం’ కాదు, రైతును చంపే డిస్కమని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను నమ్మి ఓటేసినందుకు గ్రామాల్లో ప్రజలు ఇప్పుడు తీవ్రంగా గోసపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
“చేతకాకపోతే 420 హామీలను అమలు చేయలేనని ఒప్పుకుని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని రేవంత్ రెడ్డి ప్రకటించాలి. ఆ మాట చెప్పే ధైర్యం రేవంత్‌కు ఉందా?” అని కేటీఆర్ సవాల్ విసిరారు.
