Pawan Kalyan: నంద్యాల జిల్లాలోని కొణిదెల గ్రామం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ఉదారతను చాటుకున్నారు. తన ఇంటి పేరుతో ఉన్న ఈ గ్రామానికి స్వంత నిధుల నుంచి రూ.50 లక్షల విరాళాన్ని అందజేశారు. ఇటీవలి నంద్యాల పర్యటనలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, ఈ మొత్తాన్ని గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించనున్నారు.
నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య చేసిన విజ్ఞప్తి మేరకు పవన్ కళ్యాణ్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిధులతో గ్రామంలో రోడ్లు, మురుగు కాలువలు వంటి అవసరమైన సదుపాయాలతో పాటు, 90 వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకును కూడా నిర్మించనున్నారు. గ్రామస్తుల తాగునీటి సమస్యను తీర్చడానికి ఈ ట్యాంకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
Also Read: Kommineni Remand: దారుణమైన ట్రాప్‌లో కొమ్మినేని?
Pawan Kalyan: ఈ విరాళానికి సంబంధించిన చెక్కును డీఆర్వో రామునాయక్, పరిపాలనాధికారి రవికుమార్, సెక్షన్ సూపరింటెండెంట్ నరసింహారావుకు కలెక్టర్ రాజకుమారి అందజేశారు. ఈ నిధులను సక్రమంగా వినియోగించి కొణిదెల గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. గ్రామంలో అన్ని వసతులు కల్పించేందుకు పూర్తిస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి వెల్లడించారు. ఈ నిధులతో కొణిదెల గ్రామం రూపురేఖలు మారనున్నాయి.