పర్యావరణ సమతుల్యత దెబ్బ తినకుండా.. పరిశ్రమల ఏర్పాటు కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తాను పర్యావరణ ప్రేమికుడిని.. ప్రకృతి బాగుండాలని కోరుకునే వ్యక్తినని చెప్పారు. విజయవాడలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ పై వర్కు షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు నిపుణులు, మేధావులు,యన్జీఓల సూచనలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో ఎంతవరకు కాలుష్యాన్ని నియంత్రించాలనే అంశంపై ఆలోచన చేస్తున్నామని అన్నారు. భూమి మీద కనీస బాధ్యత లేకుండా మనం జీవనం సాగిస్తున్నామని తెలిపారు.
భూమిని మనం సొంతం చేసుకోవడం కాదు.. భూమే ఏదొకనాటికి మనలను సొంతంచేసుకుంటుందని చెప్పారు. 974కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ ఉందని దానిని అభివృద్ది చేయాలని చెప్పారు. భవిష్యత్ తరాల కోసం.. మనమంతా ఇప్పుటి నుంచే ఆలోచన చేయాలని సూచించారు.కాలుష్య కోరల నుంచి సమాజాన్ని రక్షించడంలో మీరంతా పాత్రధారులు కావాలని కోరారు.
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంటే.. పరిశ్రమల యాజమాన్యాలలో అపోహలు ఉన్నాయని ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెడతారనే అపప్రద పీసీబీపై ఉందని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటు, కాలుష్యం నివారణ రెండు అంశాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టామని మీ అమూల్యమైన సలహాల ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు పవన్ కళ్యాణ్.

