Panchayat Elections: రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర అధికార యంత్రాంగం అన్నింటినీ సిద్ధం చేసి ఉంచగా, నోటిఫికేషన్ రావడమే తరువాయి అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. కొద్దిరోజుల తేడాతో అటు పంచాయతీ, ఇటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నిలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అందులో భాగంగానే జూలై నెలలోనే పంచాయతీ ఎన్నిల నిర్వహణకు ప్రభుత్వం అంతా సిద్ధం చేస్తున్నది.
Panchayat Elections: ముందుగా ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాతే పంచాయతీ ఎన్నిలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకే జూన్ నెలాఖరున పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉంటాయి. అందుకే ముందుగా ఆ ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత పార్టీ గుర్తులు లేని పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార వర్గాలు మొగ్గుచూపుతున్నాయి. తొలుత ప్రాదేశిక ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత 10 రోజల్లోనే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది.
Panchayat Elections: పంచాయతీ పాలకవర్గాల గడువు నిరుడు ఫిబ్రవరిలోనే ముగిసింది. దాదాపు 15 నెలలు దాటినా ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి అందే ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.1,600 కోట్లకు పైగా నిలిచిపోయాయి. పాలకవర్గాలు ఎన్నికైతేనే ఆయా నిధులను కేంద్రం విడుదల చేస్తుంది. ఇక మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలకవర్గాల గడువు నిరుడు జూలైలో, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల గడువు ఇటీవలే ముగిశాయి. వీటికి కూడా ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి.
Panchayat Elections: ప్రస్తుతం అన్నిచోట్ల ఇన్‌చార్జ్ అధికారుల పాలన కొనసాగుతున్నది. ఒక్క అధికారి ఐదారు పంచాయతీలు, మండలాలు, మున్సిపాలిటీలను పర్యవేక్షిస్తున్నారు. దీంతో అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడుతున్నది. ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి సమస్య తీరాలన్నా నిధులు లేవన్న సమాధానమే వస్తున్నది. నిధులు లేక అధికారులు కూడా చేతులెత్తేస్తున్నారు.
Panchayat Elections: పంచాయతీ ఎన్నికలను నిరుడే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. వివిధ హామీల అమలుగాక, 42 శాతం బీసీ రిజర్వేషన్ల హామీని అమలు చేయలేకపోవడంతో ఎన్నికలకు వెళ్లలేదు. 42 శాతం రిజర్వేషన్లను అమలు చేశాకే ఎన్నికలకు వెళ్తామని సీఎం సహా మంత్రులు, ఇతర నేతలు ప్రకటిస్తూ వచ్చారు. దీంతో సమగ్ర కులగణన సర్వే సైతం ప్రభుత్వం చేపట్టింది. ఆ తర్వాత బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పించే రెండు బీసీ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం ఈ రెండు బిల్లలు రాష్ట్రపతి వద్దే పెండింగ్‌లో ఉన్నాయి.
Panchayat Elections: ఇదిలా ఉండగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా జనగణనతోపాటు కులగణన చేసేందుకు అంగీకరించింది. ఈ ప్రక్రియ పూర్తికావాలంటే మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉన్నది. దీంతో తెలంగాణ రాష్ట్రం చేసిన కులగణన వివరాల ఆధారంగా బీసీ రిజర్వేషన్ల బిల్లులను రాష్ట్రపతి ఆమోదించడం ప్రశ్నార్థకంగా మారింది. దీంతో పార్టీ పరంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు సిద్ధపడాలని అధికార కాంగ్రెస్ పార్టీ ఇతర అన్ని రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చే అవకాశం ఉన్నది.