Karuna Kumar: ‘పరేషాన్’, ‘మసూద’, ‘పలాస’ వంటి విభిన్నమైన సినిమాలతో నటనలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. ఈ చిత్రాన్ని రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా, సందీప్ అగరం, అశ్మితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవంబర్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మంగళవారం జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్ల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్, యదు వంశీ, ఆదిత్య హాసన్, రామ్ అబ్బరాజు, సన్నీ, దుశ్యంత్, ఉదయ్ గుర్రాల, రూపక్, తేజ, నంద కిషోర్ వంటి 13 మంది దర్శకులు అతిథులుగా హాజరై టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు.
హీరో తిరువీర్ ఎమోషనల్ స్పీచ్
ఈ ఈవెంట్‌లో హీరో తిరువీర్ మాట్లాడుతూ.. దర్శకుడు రాహుల్ కథ చెప్పినప్పుడు కంటిన్యూగా నవ్వుతూనే ఉన్నా. అంతే సరదాగా షూటింగ్ చేశాం. మంచి కంటెంట్‌తో సినిమా తీసాం. ప్రేక్షకులందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అని చెప్పారు.
ఇక హీరోయిన్ టీనా శ్రావ్య మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరినీ ఎంటర్‌టైన్ చేసేలా సినిమా ఉంది. ఫన్‌తోపాటు ఎమోషన్ కూడా ఉంటుంది అని వివరించారు.
కరుణ కుమార్ మాటలతో కదిలిపోయిన తిరువీర్
‘పలాస’ ఫేమ్ డైరెక్టర్ కరుణ కుమార్ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. తిరువీర్‌ని మొదట ఓ నాటకంలో చూసి అతని నటనకు ఫిదా అయ్యా. ‘పలాస’ సినిమా తీసేటప్పుడు అతన్ని తప్పక తీసుకోవాలని అనుకున్నా. ఆ సినిమా షూట్ సమయంలో తిరువీర్ తల్లి చనిపోయినా, ఆ విషయాన్ని మాకు చెప్పకుండా షూటింగ్‌లో పాల్గొన్నాడు. అటువంటి డెడికేటెడ్ నటుడు తక్కువగా ఉంటారు అన్నారు.
ఇది కూడా చదవండి: Kangana Ranaut: పరువు నష్టం కేసులో కంగనా రనౌత్‌కు బెయిల్
కరుణ కుమార్ మాటలు వింటూ తిరువీర్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ మాటల్లో…
ట్రైలర్‌కి వంద రెట్లు మించి సినిమా ఉంటుంది. తిరువీర్ సహకారం లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ రెండింట్లోనూ తిరువీర్ మా టీమ్‌కి హీరో అని దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ అన్నారు.
నిర్మాత సందీప్ అగరం మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది అని తెలిపారు.
సంగీతం – సురేష్ బొబ్బిలి, కళాకారుల హాజరు
సినిమాకు సంగీతం అందిస్తున్నది సురేష్ బొబ్బిలి. ఈ ఈవెంట్‌లో నటి యామిని, నటుడు నరేంద్ర, మాస్టర్ రోహన్ తదితరులు పాల్గొన్నారు.
తిరువీర్ జర్నీ – నాటకరంగం నుంచి సినీరంగం వరకు
రంగారెడ్డి జిల్లా మామిడిపల్లి గ్రామానికి చెందిన తిరువీర్, చిన్నప్పటి నుంచే నటన పట్ల ఆసక్తి చూపాడు. నాటకరంగం నుంచి ప్రారంభించి, రేడియో జాకీగా కూడా పని చేశాడు. తర్వాత ‘బొమ్మలరామారం’ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చాడు.
‘ఘాజీ’, ‘మల్లేశం’, ‘జార్జ్ రెడ్డి’, ‘పలాస 1978’, ‘టక్ జగదీష్’ వంటి సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ 2022లో విడుదలైన ‘మసూద’ సినిమా అతనికి గేమ్‌చేంజర్‌గా మారింది. హారర్ జానర్‌లో వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్‌గా నిలిచి, తిరువీర్‌ని ప్రేక్షకుల మనసుల్లో నిలబెట్టింది. ప్రస్తుతం ఆయన ‘భగవంతుడు’ తో పాటు మరో మూడు ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు.

