Pakistani Spies: కర్ణాటక తీరప్రాంతంలో సంచలనం సృష్టిస్తూ, పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై ఉడుపిలోని ఓ షిప్‌యార్డ్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులను కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టులతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున భద్రతా హెచ్చరికలు జారీ అయ్యాయి. అరెస్ట్ అయిన వారిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన రోహిత్, సంత్రీగా గుర్తించారు. వీరు సుష్మా మెరైన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన మాల్పే కోచిన్ షిప్‌యార్డ్‌లో పనిచేస్తున్నారు. నిందితులు గత 18 నెలలకు పైగా షిప్‌యార్డ్‌కు సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్తాన్‌లోని తమ హ్యాండ్లర్‌లకు పంపినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఇది కూడా చదవండి: Mohan Bhagwat: హిందువులు లేకపోతే ప్రపంచం లేదు.. మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
ఈ సమాచారంలో భారత నావికాదళం కోసం, అలాగే ప్రైవేట్ క్లయింట్ల కోసం నిర్మించిన నౌకల (Vessels) వివరాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ డేటాను డబ్బుకు బదులుగా వాట్సాప్ ద్వారా పంపినట్లు వెల్లడించారు. కోచిన్ షిప్‌యార్డ్ సీఈఓ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.ఈ సమాచార లీకేజీ దేశ సార్వభౌమత్వానికి, జాతీయ భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ వెనుక విస్తృత నెట్‌వర్క్ ఉందని అనుమానిస్తున్న దర్యాప్తు ఏజెన్సీలు, ఈ కేసు విచారణలో జాతీయ భద్రతా అధికారులు కూడా పాలుపంచుకునే అవకాశం ఉందని వర్గాలు సూచిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

