Jaffar Express: ఇటీవల బలూచిస్తాన్‌లో జరిగిన జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాక్ ఘటన అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. బలూచిస్తాన్ స్వతంత్రం కోసం పోరాడుతున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ఈ దాడిని చేపట్టింది. పాకిస్థాన్ ప్రభుత్వంపై బీఎల్ఏ గత కొంతకాలంగా తీవ్రంగా ప్రతిఘటన కొనసాగిస్తున్న నేపథ్యంలో, ఈ మధ్య కాలంలో వారి దాడులు మరింత ఉద్ధృతమవుతున్నాయి.
ఈ నెల 11వ తేదీన క్వెట్టా నుంచి పేషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును బలూచ్ రెబల్స్ హైజాక్ చేశారు. రైలులో 400 మందికిపైగా ప్రయాణికులు, పాక్ సైనికులు ఉన్నారు. జరిగిన కాల్పుల్లో 21 మంది పౌరులు, నలుగురు సైనికులు మరణించారని పాక్ సైన్యం ప్రకటించింది. అయితే, బీఎల్ఏ తాజాగా చేసిన ప్రకటన ప్రకారం, ఈ హైజాక్ ఘటనలో 214 మంది పాక్ సైనికులను బందీలుగా పట్టుకొని, వారిని హతమార్చినట్లు ప్రకటించింది.
Also Read: Tourists Entry Fee: సరదాగా ఆ రాష్ట్రంలోకి వెళ్లాలంటే ఎంట్రీ ఫీజ్ కట్టాల్సిందే!
Jaffar Express: బందీలుగా పట్టుకున్న తమ కార్యకర్తలను విడుదల చేయాలని బీఎల్ఏ పాక్ సైన్యానికి 48 గంటల గడువు ఇచ్చింది. అయితే, పాక్ ప్రభుత్వం స్పందించకపోవడంతో, ఆ సైనికులను హతమార్చినట్లు బీఎల్ఏ ప్రకటించింది. దీనిపై స్పందించిన పాక్ సైన్యం, 30 గంటల పాటు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి, 33 మంది బీఎల్ఏ తీవ్రవాదులను హతమార్చి, బందీలను కాపాడామని తెలిపింది.
అయితే, ఈ విషయాన్ని బీఎల్ఏ ఖండిస్తూ, పాక్ సైన్యం తప్పుడు సమాచారం ప్రచారం చేస్తోందని ఆరోపించింది. నిజమైన పరిస్థితులను అర్థం చేసుకోవడానికి స్వతంత్ర జర్నలిస్టులను పంపాలని బీఎల్ఏ పాక్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ ఘటనతో బలూచిస్తాన్-పాక్ మధ్య ఉన్న ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి.