Maha Kumbhamela 2025: పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్ నుండి 68 మంది హిందూ యాత్రికులు మహా కుంభమేళాలో పాల్గొని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో జనవరి 13న మహా కుంభమేళా కార్యక్రమం ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుండగా, ఇప్పటివరకు 34 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా వేలాది మంది మహా కుంభమేళాలో పాల్గొని పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో, పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్ నుండి 68 మంది హిందూ యాత్రికులు మహా కుంభమేళాలో పాల్గొన్నారు. వారు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. వారు పవిత్ర ఆచారాల కోసం ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించి, వారి పూర్వీకుల చితాభస్మాన్ని పూజించారు.
ఇది కూడా చదవండి: Auto Driver: భార్య పుట్టింటికి వెళ్లిందని ఆ ఆటోడ్రైవర్ చేసిన పని తెలిస్తే నవ్వకుండా ఉండలేరు!
ప్రత్యేక వీసాలపై వచ్చిన యాత్రికులు గంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర సంగమంలో స్నానం చేసి, తమ పూర్వీకులను పూజించారు. పాకిస్తాన్‌కు చెందిన 11వ తరగతి విద్యార్థిని సురబి తొలిసారి భారతదేశాన్ని సందర్శించి, కుంభమేళాలో పాల్గొనడం పట్ల తన ఉత్సాహాన్ని వ్యక్తం చేసింది.
తాను ఇక్కడ ఉండటం చాలా గౌరవంగా భావిస్తున్నానని సురభి చెప్పింది. అంతేకాకుండా తమ బృందానికి వీసా ఆమోదం సులభతరం చేసినందుకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

