Heavy Rain Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను వరుణుడు విడిచి పెట్టడం లేదు. ఒక వాయుగుండం ప్రభావం ముగిసిందనుకుంటే, వెంటనే మరో అల్పపీడనం తలెత్తి వర్షాల వేట మొదలుపెడుతోంది. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే రోజుల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో ఇరురాష్ట్రాల్లో వారం రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇప్పటికే గత కొన్ని వారాలుగా వరుస వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల కుండపోత వర్షాలు పడటంతో పంటలు దెబ్బతిన్నాయి, రవాణా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఈ తరుణంలో మళ్లీ అల్పపీడన ప్రభావం కలకలం రేపుతోంది.
ఆంధ్రప్రదేశ్లో ఎల్లో అలర్ట్
విపత్తుల నిర్వహణ సంస్థ వివరాల ప్రకారం.. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సెప్టెంబర్ 2నాటికి వాయుగుండంగా మారే అవకాశముంది. ఇది వాయువ్య దిశగా కదిలి శుక్రవారం ఉదయానికి దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా.
ఈ ప్రభావంతో ఏపీలో పలు జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అదనంగా ఏలూరు, కృష్ణా జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.
ఇది కూడా చదవండి: Chandrababu: స్వర్ణాంధ్ర 2047 విజన్
తెలంగాణలోనూ వానల మోత
మరోవైపు తెలంగాణలోనూ వర్షాలు కొనసాగనున్నాయి. రాబోయే మూడు నుండి నాలుగు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. గురు, శుక్రవారాల్లో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వర్షాల కారణంగా తక్కువ ఎత్తులోని ప్రాంతాలు మునిగే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎప్పటికప్పుడు స్థానిక అధికారుల సూచనలు పాటించాలి.