Operation Kagar: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. కేంద్రం, రాష్ట్రాల భద్రతా బలగాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఆపరేషన్ కగార్’ లో భాగంగా జరిగిన ఈ కాల్పుల్లో 38 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు విశ్వసనీయ సమాచారం. కర్రెగుట్టల అడవులు ఇప్పుడు యుద్ధ భూములా మారాయి.
ఈ ఆపరేషన్‌లో పదివేలకు పైగా భద్రతా బలగాలు పాల్గొంటున్నాయి. తెలంగాణ ములుగు జిల్లా నుంచి ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ వరకు, అలాగే మహారాష్ట్ర గడ్చిరోలి వరకు మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టారు. డ్రోన్లు, శాటిలైట్‌లు వంటి ఆధునిక సాంకేతిక పరికరాలతో మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టి, పై నుంచి బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
ఈ ఆపరేషన్ లక్ష్యం మావోయిస్టుల అగ్రనేత హిడ్మా అని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. అతడితో పాటు వందలాది మంది మావోయిస్టులు కర్రెగుట్టల్లో తలదాచుకుని ఉన్నట్లు సమాచారం. గత ఐదు రోజులుగా కూబింగ్ కొనసాగుతుండగా, తాజాగా జరిగిన ఎదురుకాల్పుల్లో 38 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఓ జవాన్‌కు గాయాలు అయినట్టు సమాచారం.
ఘోర కాల్పుల నేపథ్యంలో బస్తర్ ఇన్‌ఛార్జ్ రూపేష్ పేరుతో మావోయిస్టులు ఓ లేఖ విడుదల చేశారు. అందులో “ఆపరేషన్ కగార్ తక్షణమే ఆపండి, మేం శాంతి చర్చలకు సిద్ధం” అంటూ పేర్కొన్నారు. ఒక నెలపాటు సైనిక చర్య వాయిదా వేసి చర్చలు జరిపితే పరిష్కార మార్గం కనిపిస్తుందని సూచించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ కూడా గతంలో పలు లేఖలు విడుదల చేసి ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.
Also Read: Pakistan Army: పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. ఆర్మీ వాహనాన్నిపేల్చేసిన BLA.. 10 మంది సైనికులు హతం
Operation Kagar: కర్రెగుట్టల్లో జరుగుతున్న బాంబుల దాడులు, కాల్పులపై పౌరహక్కుల సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. “దేశం పౌరులపై యుద్ధం చేస్తోందా?” అంటూ ప్రశ్నిస్తున్నారు. భారత్ బచావో పేరుతో పౌర హక్కుల సంఘాలు ఓ లేఖ విడుదల చేసి, శాంతి చర్చలు ప్రారంభించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాయి.
ఇప్పటికే మావోయిస్టు పార్టీ నిర్మూలనే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది భారత చరిత్రలోనే అతిపెద్ద మావోయిస్టు ఆపరేషన్ గా చెబుతున్నారు అధికారులు. అయితే శాంతి చర్చల అవకాశాలను ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకుంటాయా? లేక మరింత మిలిటరీ చర్యలు చేపడతాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు గణనీయంగా వినిపిస్తున్నాయి.