Operation Akhal: జమ్మూ కశ్మీర్‌లో భద్రతా బలగాలు మళ్లీ ఉగ్రవాదులపై ఆపరేషన్ చేపట్టాయి. కుల్గాం జిల్లాలోని అఖల్ అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది మృతి చెందాడు.
భద్రతా వర్గాల సమాచారం ప్రకారం, అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని నిఘా వర్గాలు ముందుగానే హెచ్చరించాయి. దీంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు అడ్డుగా కాల్పులు ప్రారంభించటంతో.. ఈ ఆపరేషన్ ఎదురుకాల్పులుగా మారింది.
భద్రతా దళాలు అప్రమత్తంగా స్పందించాయి. రాత్రంతా పలుమార్లు కాల్పులు జరగడం, ఉదయానికీ తీవ్ర కాల్పులు కొనసాగడంతో ఉగ్రవాదుల చలనం పూర్తిగా అడ్డుకున్నాయి. ఇప్పటివరకు ఓ ఉగ్రవాదిని హతమార్చినట్టు చినార్ కార్ప్స్ వెల్లడించింది. ప్రస్తుతం అక్కడ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఇది ఏప్రిల్‌లో పహల్గామ్ దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన ‘ఆపరేషన్ మహాదేవ్’ తరువాత జరుగుతున్న మరో ముఖ్యమైన ఎన్‌కౌంటర్ కావడం గమనార్హం.
ఇది కూడా చదవండి: Bala Krishna: ‘భగవంత్ కేసరి’కి జాతీయ అవార్డు.. అపారమైన గర్వకారణం..!
ఇదిలా ఉండగా, ఇటీవల జూలై 28న శ్రీనగర్ సమీపంలోని దచిగామ్ నేషనల్ పార్క్ వద్ద ముల్నార్ అనే ప్రాంతంలో మరో ఘర్షణ జరిగింది. ఆ ఎన్‌కౌంటర్‌లో పహల్గామ్ దాడికి సూత్రధారిగా ఉన్న సులేమాన్ అలియాస్ ఆసిఫ్‌తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. వీరిలో జిబ్రాన్, హంజా ఆఫ్ఘన్‌లను గతంలో సోనామార్గ్ టన్నెల్ దాడికి పాల్పడినవారిగా గుర్తించారు.
ఇంతకుముందు మే 7న పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ బలగాలు ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ప్రతీకార దాడులు నిర్వహించాయి. కారణం.. పహల్గామ్‌లో జరిగిన కాల్పుల్లో 26 మంది, ఎక్కువగా పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు.
ఇటీవల గురువారం, పూంచ్ సెక్టార్‌లో ఎల్‌ఓసి సమీపంలో కూడా మరో ఇద్దరు పాకిస్తానీ ఉగ్రవాదులను హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. వారు భారత భూభాగంలోకి చొరబడగానే ఎదురుదాడి చేసి అడ్డుకున్నారు.
OP AKHAL, Kulgam
Contact established in General Area Akhal, Kulgam. Joint Operation in progress.#Kashmir@adgpi@NorthernComd_IA pic.twitter.com/d2cHZKiC61
— Chinar Corps🍁 – Indian Army (@ChinarcorpsIA) August 1, 2025