Venkaiah Naidu: భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాతృభాష అయిన తెలుగుకు పూర్తి గౌరవం దక్కాలని గట్టిగా పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో తెలుగు భాషను చదువుకున్న వారికి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలనే నియమాన్ని పెట్టాలని ఆయన సూచించారు. మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలో జరుగుతున్న ‘కృష్ణా తరంగ్ 2025’ ఉత్సవాల ప్రారంభోత్సవానికి హాజరై ఆయన ప్రసంగించారు.
పాలనా భాషగా తెలుగు:
ఇటీవల దివంగత రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు జయంతి సందర్భంగా తాను రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశానని వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలలో ఉత్తర ప్రత్యుత్తరాలు తప్పనిసరిగా తెలుగు భాషలోనే జరపాలని తాను కోరగా, దీనికి ముఖ్యమంత్రులు చేస్తామని హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు. ఈ విధంగా తెలుగులోనే పాలన సాగించడం రామోజీరావుకు ఇచ్చే ఘన నివాళి అవుతుందని ఆయన పేర్కొన్నారు.
ఆంగ్లేయులు వారి భాషను అధికార భాషగా చేసుకుని పాలన చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ, మనం తెలుగు వాళ్లం కాబట్టి తెలుగును పరిపాలన భాషగా చేసుకోవాలని ఆయన సూచించారు. దేశంలోని భారతీయ భాషలను కాపాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆలోచన చేస్తున్నారని ఆయన చెప్పారు.
Also Read: Atchannaidu: జగన్‌కు మంత్రి అచ్చెన్నాయుడు సవాల్.. చర్చకు సిద్ధమా?
విద్యలో మాతృభాషకు స్థానం:
మెడికల్, ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యను కూడా ఆయా మాతృభాషల్లో బోధించేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని వెంకయ్య నాయుడు వివరించారు. మన వాళ్లు ఇంగ్లీష్ మాట్లాడితేనే గొప్ప అని భావించడం సరైనది కాదని, ఇంగ్లీష్ సరిగా రాకపోయినా పేపర్‌పై రాసుకుని మరీ మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ముందుగా మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ తర్వాతే ఇతర సోదర భాషలను నేర్చుకోవాలని ఆయన విద్యార్థులకు, ప్రజలకు కోరారు.
వ్యక్తిగత అనుభవం:
తాను చదువుకునే రోజుల్లో సరిగా తెలియక హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నానని మాజీ ఉపరాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు. తాను వీధి బడిలో చదువుకున్నప్పటికీ, దేశంలో ఉపరాష్ట్రపతి స్థాయి వరకు ఎదగగలిగానని తెలిపారు. దేశంలో 22 భాషలు ఉన్నాయని, రాజ్యసభలో ఈ భాషల్లో దేనిలోనైనా మాట్లాడవచ్చనే ఉత్తర్వులు ఇచ్చామని వెంకయ్య నాయుడు ఈ సందర్భంగా వెల్లడించారు.

