Shikhar Dhawan: అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రముఖ క్రికెటర్, టీమ్ ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్‌కు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. గురువారం విచారణకు హాజరు కావాలని ఆయన్ని ఆదేశించారు.
1XBet యాప్‌తో ధావన్‌కు సంబంధాలు
ఈడీ అధికారుల దర్యాప్తులో, శిఖర్ ధావన్ 1XBet అనే ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసినట్లు గుర్తించారు. ఈ యాప్ ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. గతంలో ఇదే కేసులో మరో క్రికెటర్ సురేష్ రైనాను కూడా ఈడీ విచారించిన విషయం తెలిసిందే. 1XBet యాప్ గత సంవత్సరం డిసెంబర్‌లో సురేష్ రైనాను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది.
బడా సెలబ్రిటీలపై ఈడీ నజర్
ఈడీ కేవలం క్రికెటర్లనే కాకుండా పలువురు సినీ నటులను కూడా విచారిస్తోంది. మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్‌తో పాటు నటులు సోనూ సూద్, ఊర్వశి రౌతేలాలను కూడా అధికారులు విచారణ జరిపారు.
యాప్స్ మారుపేర్లు, ఆర్థిక లావాదేవీలు
నిషేధిత బెట్టింగ్ యాప్‌లైన 1XBet, FairPlay, Parimatch, Lotus365 వంటివి తమ ప్రకటనలలో 1XBat, 1XBat Sporting Lines వంటి మారుపేర్లను వాడుతున్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ ప్రకటనలలో ఉన్న QR కోడ్‌లు ప్రజలను నేరుగా బెట్టింగ్ వెబ్‌సైట్లకు దారి తీస్తున్నాయి. ఈ యాప్స్ ద్వారా జరిగే ఆర్థిక లావాదేవీలపై, మనీ లాండరింగ్ అంశాలపై ఈడీ దృష్టి సారించింది. ఈ చర్యలతో అక్రమ బెట్టింగ్ యాప్స్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని స్పష్టమవుతోంది.