OG Movie: అంతటా ఓజీ సినిమా మేనియా నడుస్తున్నది. రెండు తెలుగు రాష్ట్రాలే కాదు.. దేశవ్యాప్తంగా హాట్ కేక్ అయింది. అమెరికా తదితర ప్రపంచవ్యాప్త దేశాల్లో కూడా హంగామా నడుస్తుంది. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా గురువారం (సెప్టెంబర్ 25) థియేటర్లలో విడుదలైంది. ఈ మేరకు అన్ని సినిమా థియేటర్లలో అభిమానుల సందడి ఓ రేంజిలో కేరింతలు కొట్టిస్తున్నది. ఈ నేపథ్యంలో ఓజీ సినిమా ప్రదర్శిస్తున్న ఓ సినిమా హాలులో విషాదం నెలకొన్నది.
OG Movie: తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని ఏసియన్ సినిమా థియేటర్‌లో ఓజీ సినిమా విడుదలైంది. మార్నింగ్‌షోలో ఓజీ సినిమా ప్రదర్శితం అవుతుండగా, గోడపై ఉన్న స్పీకర్ బాక్స్ పడి సినిమా చూస్తున్న ఓ ఇద్దరు అభిమానులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని అక్కడి పోలీసులు వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
OG Movie: అయితే థియేటర్ కెపాసిటీకి మించి 1,200 మందిని సినిమాకు అనుమతించారని, దీంతో ఉక్కిరిబిక్కిరి అయ్యామని, సినిమా థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇద్దరు అభిమానులకు గాయాలు కావడంపై ఇతర అభిమానులు కూడా స్పందించారు. వారికి వెంటనే చికిత్స చేయాలని, ఆర్థిక సాయం అందజేయాలని వారు కోరుతున్నారు.
ఇదిలా ఉండగా తొలుత టికెట్ల తీసుకున్న వారిని థియేటర్ లోపలికి అనుమతించారు. ఆ తర్వాత టికెట్ లేకుండా వందలాది మంది లోపలికి తోసుకొని వచ్చారని తెలిసింది. బ్లాక్‌లో టికెట్లు అమ్ముకోవడంతోనే ఈ సమస్య వచ్చిందని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ తోపులాట సమయంలోనే ఇద్దరికి గాయాలయ్యాయని మరో సమాచారం. కొద్ది సమయం గడిస్తేనే పూర్తి వివరాలు బయటకు వస్తాయి.