AP News: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగిన ఒక దారుణ సంఘటనతో రాష్ట్రంలో కిడ్నీ రాకెట్ విషయం బయటపడింది. ఆరోగ్య శాఖ నిబంధనలకు అస్సలు కట్టుబడకుండా, అక్రమంగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేస్తున్న గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు. ఈ ఆసుపత్రిలోనే యమునా అనే యువతి కిడ్నీ ఆపరేషన్ వికటించి ప్రాణాలు కోల్పోవడం ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి రావడానికి కారణమైంది.
యమునా మృతితో వెలుగులోకి అక్రమం
విశాఖపట్నంకు చెందిన యమునాకు మదనపల్లెలోని గ్లోబల్ ఆసుపత్రిలో రహస్యంగా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స జరుగుతుండగా ఆమె మరణించింది. ఈ విషయంపై మృతురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కిడ్నీల అక్రమ రవాణా గురించి బయటపడింది. బాధితులు వెంటనే తిరుపతి నుంచి 112 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో తిరుపతి పోలీసులు మదనపల్లెకు వచ్చి దర్యాప్తు మొదలుపెట్టారు.
ఆసుపత్రి సీజ్… దర్యాప్తు షురూ
ఈ కేసుపై జిల్లా వైద్యాధికారిణి దేవశివమణి గారు బుధవారం మదనపల్లెకు వచ్చి స్వయంగా విచారణ జరిపారు. ఎస్బీఐ కాలనీలోని గ్లోబల్ ఆసుపత్రిని తనిఖీ చేసి, ఆపరేషన్ల కోసం వాడిన యంత్రాలను, రికార్డులను పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. వైద్యశాఖ నిబంధనలను ఆసుపత్రి ఉల్లంఘించినట్లు నిర్ధారించుకుని, దానిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను ప్రభుత్వానికి పంపనున్నట్లు కూడా తెలిపారు.
నిందితులపై కఠిన చర్యలు
ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారానికి సంబంధించి మదనపల్లె రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ రాజారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందం విచారణ చేస్తోంది. ఆసుపత్రికి చెందిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులపై మానవ అవయవాల అక్రమ రవాణాతో పాటు చీటింగ్ కేసులు కూడా నమోదు చేసినట్లు సీఐ రాజారెడ్డి తెలిపారు.

