Nivetha Pethuraj: టాలీవుడ్, కొలీవుడ్ సినిమాల్లో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నివేతా పేతురాజ్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. బిజినెస్‌మన్ రాజ్ హిత్ ఇబ్రాన్‌నే జీవిత భాగస్వామిగా ఎంచుకున్నట్టు ఆమె సోషల్ మీడియాలో పరోక్షంగా ప్రకటించారు.
నిన్న రాత్రి నివేతా తన ప్రియుడితో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ, “ఇప్పటినుంచి జీవితం అంతా ప్రేమమయమే..” అని క్యాప్షన్ రాయడంతో పాటు, రింగ్ ఎమోజీని కూడా జోడించారు. దీంతో ఎంగేజ్‌మెంట్ జరిగినట్టే భావిస్తున్నారు. ఈ ఫొటోలు కాసేపట్లోనే వైరల్ కావడంతో సోషల్ మీడియాలో శుభాకాంక్షల వరద కురుస్తోంది.
ప్రేమ నుంచి పెళ్లి వరకు
మధురైలో పుట్టి పెరిగిన నివేతా, కొంతకాలంగా కుటుంబంతో కలిసి దుబాయ్‌లో స్థిరపడ్డారు. కార్ రేసింగ్ పట్ల ఆసక్తి ఉన్న సమయంలోనే రాజ్ హిత్ ఇబ్రాన్‌తో పరిచయం ఏర్పడింది. ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారి ఇప్పుడు వివాహ బంధం దాకా వచ్చింది. సమాచారం ప్రకారం, ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి జరగనుంది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే ఈ వేడుక గోప్యంగా నిర్వహించనున్నారు.
ఇది కూడా చదవండి: Railway: తెలంగాణలో భారీ వర్షాలు.. పలు రైళ్ల రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
సినీ ప్రయాణం
2016లో విడుదలైన ‘ఓరు నాళ్ కోత్తు’ (తమిళం) సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నివేతా, తర్వాత ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి నటించిన *‘ఎమ్మానస్ తంగం’*తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘టిక్ టిక్ టిక్’, ‘తిమిరు పుటిచవన్’, ‘సంగతమిజ్’, ‘పొన్మాణికవేల్’ వంటి పలు తమిళ చిత్రాల్లో నటించారు.
తెలుగులో మాత్రం 2017లో విడుదలైన ‘మెంటల్ మదిలో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత చిత్రలహరి, బ్రోచేవారెవరు రా, రెడ్, పాగల్, అల వైకుంఠపురములో వంటి చిత్రాల్లో నటించారు. వెబ్‌సిరీస్ *‘భూ’*లో కూడా కనిపించారు. ఇటీవల విశ్వక్ సేన్ హీరోగా నటించిన *‘దాస్ కా ధమ్కీ’*లో కనిపించారు. ప్రస్తుతం ‘పార్టీ’ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు.
వరుడు ఎవరు?
రాజ్ హిత్ ఇబ్రాన్ దుబాయ్‌లో హాస్పిటాలిటీ రంగంలో బిజినెస్ చేస్తూ స్థిరపడ్డారు. నివేతాతో పరిచయం ఏర్పడి, ప్రేమలో పడిన ఈ జంట ఇప్పుడు జీవితాంతం కలిసి సాగేందుకు సిద్ధమవుతున్నారు.

