Nimmala ramanaidu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నేడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చోడవరం నియోజకవర్గంలో జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తోందని తెలిపారు. ముఖ్యంగా వృద్ధుల పింఛన్లను వారి ఇంటి వద్దకే చేరవేస్తున్నామని చెప్పారు. “ఐదేళ్లలో ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ మొత్తంతో ఐదు పోలవరం ప్రాజెక్టులు నిర్మించవచ్చు. అయినా ఒక్కరినీ వదిలిపెట్టకుండా పెన్షన్ అందిస్తున్నాం. ఇచ్చిన హామీలపై రాజీపడకుండా ముందుకు సాగుతున్నాం” అని పేర్కొన్నారు.
గత ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆయన, “మూడు రాజధానులని చెప్పారు… కానీ ఒక్క రాజధాని కూడా కట్టలేదు. రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలను వెనక్కు పంపారు. మద్యం, ఇసుక, మైనింగ్, భూముల దోపిడీ జరిగింది. ఈనాటి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆ పొరపాట్లను సరిదిద్దుతోంది” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మలతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ, కేఎస్ఎన్ఎస్ రాజు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు తదితరులు పాల్గొన్నారు.

