Niharika: ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనలో, ఆమె కుమారుడు ప్రస్తుతం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై నటి నిహారిక తొలిసారి స్పందించారు.
“ఇలాంటి ఘటనలు ఎవరి తప్పుతో జరగవు, అయితే జరిగిన ఘటన చాలా బాధాకరం. ఆ మహిళ మరణం నాకు ఎంతో బాధ కలిగించింది,” అని నిహారిక తెలిపారు. ఈ విషయంలో అందరి మద్దతుతో అల్లు అర్జున్ తన బాధ నుంచి క్రమంగా కోలుకుంటున్నారని ఆమె వెల్లడించారు.
తాజా చిత్రం ‘మద్రాస్ కారన్’ ప్రమోషన్‌లో భాగంగా మాట్లాడిన నిహారిక, తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి కూడా మాట్లాడారు. “కథల ఎంపికలో సందిగ్ధంలో ఉన్నప్పుడు నా అన్న వరుణ్ తేజ్ సలహా తీసుకుంటాను. రామ్ చరణ్ అన్నతో సరదాగా గడపడం నాకు చాలా ఇష్టం,” అని తెలిపారు.
“లుక్స్ విషయంలో అల్లు అర్జున్ ఎంత జాగ్రత్తలు తీసుకుంటారో, ప్రతి సినిమాకు ఆయన తన స్టైల్ మారుస్తారు,” అని అన్నారు. కాగా, నిహారిక ప్రధాన పాత్రలో నటించిన ‘మద్రాస్ కారన్’ ఈ నెల 10న విడుదల కానుంది.