మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఏసీబీకి మరో ఫిర్యాదు అందింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఓఆర్ఆర్ టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు బీసీ రాజకీయ జేఏసీ అధ్యక్షుడు యుగంధర్ గౌడ్ ఈ ఫిర్యాదు చేశారు. ఓఆర్ఆర్ టెండర్లలో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ యుగంధర్ గౌడ్ తన ఫిర్యాదులో ఏసీబీ అధికారులను కోరారు.
కేటీఆర్ ఇప్పటికే ఫార్ములా ఈకార్ రేస్ కేసును ఎదుర్కొంటుండగా, ఇప్పుడు ఓఆర్ఆర్ టెండర్లలో అవకతవకల వ్యవహారంలో ఆయన మరో కేసును ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఓఆర్ఆర్‌పై టోల్ వసూళ్ల ద్వారా ఏడాదికి రూ.600 కోట్ల ఆదాయం సమకూరేదని, దీంతో 30 ఏండ్లకు రూ.18 వేల కోట్ల ఆదాయం వచ్చేదని, అలాంటిది 7,380 కోట్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటిగించిందని సీఎం రేవంత్‌రెడ్డి కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. హెచ్ఎండీఏ అనుసరించిన టెండరు విధానంతోనే ప్రభుత్వం రూ.15 వేల కోట్లకు పైగా నష్టపోయిందని ఆయన ఆరోపించారు. ఈ కేసు విషయంలోనూ కేటీఆర్ విచారణను ఎదుర్కోనున్నారు.