Rammohan Naidu: రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ పురందేశ్వరితో కలిసి దిల్లీలోని రాజీవ్‌గాంధీ భవన్ నుంచి వర్చువల్‌గా ఈ సేవలను ప్రారంభించారు. ఈ రూట్లో విమానాలను అలయన్స్ ఎయిర్ సంస్థ నడపనుంది.
ఈ సదుపాయం ద్వారా ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు ఆధ్యాత్మిక యాత్రలు మరింత సులభతరం కానున్నాయి. రెండో తేదీ నుంచి షెడ్యూల్ ప్రకారం ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. మంగళవారం, గురువారం, శనివారం రోజుల్లో ఈ విమానాలు నడవనున్నాయి.
ఇది కూడా చదవండి: Atrocity: మరీ ఇంత దుర్మార్గమా.. జాతీయ పక్షి పట్ల ఇలాగేనా ప్రవర్తించేది?
రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ – “రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి ఆకాశయానం ప్రారంభం కావడం వల్ల ఉభయ గోదావరి జిల్లాల వాసులకు పెద్ద సౌకర్యం కలిగింది. ముఖ్యంగా ఆధ్యాత్మిక యాత్రికులు వేగంగా, సులభంగా తిరుపతికి చేరుకోవచ్చు” అని పేర్కొన్నారు.
బాలయోగి సేవలు చిరస్మరణీయం: రామ్మోహన్ నాయుడు
ఈ కార్యక్రమం సందర్భంగా దివంగత లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి జయంతి సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్లో అంజలి ఘటిస్తూ, బాలయోగి జీవితం ఎన్నో తరాలకు ఆదర్శమని అన్నారు.
“కోనసీమ గడ్డ నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంలో లోక్‌సభ స్పీకర్‌గా పని చేసి తెలుగువారి ప్రతిష్టను ఎత్తి చూపారు. ఆయన సేవలు దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాయి” అని రామ్మోహన్ నాయుడు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సానా సతీశ్, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.