Toxic Movie: సౌతిండియన్ సూపర్ స్టార్ నయనతార కన్నడ స్టార్ హీరో యశ్ తాజా చిత్రంలో నటిస్తోందనే విషయం రూఢీ అయ్యింది. ఈ విషయాన్ని టాక్సిక్ చిత్ర బృందం ఇంకా అధికారికంగా చెప్పకపోయినా… అందులో కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు అక్షయ్ ఓబెరాయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పేశాడు. తనతో పాటు యశ్ మూవీలో నయనతార కూడా ఉందని, అయితే అంతకు మించి ఆమె పోషించే పాత్ర గురించి చెప్పడం భావ్యం కాదని తెలిపాడు. నిజానికి టాక్సిక్ మూవీలో బాలీవుడ్ భామ కరీనా కపూర్ నటిస్తున్నట్టు మొదట్లో వార్తలు వచ్చాయి. కానీ దానికి సంబంధించిన అధికారిక సమాచారం కూడా ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే మూవీని ఏప్రిల్ 10న విడుదల చేయాలి. దర్శకురాలు గీతూ మోహన్ దాస్… ఇటీవల యశ్ బర్త్ డే ను పురస్కరించుకుని విడుదల చేసిన గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

