Nara lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించేందుకు రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన బెంగళూరు పర్యటనకు భారీ ఫలితాలు దక్కాయి. ఈ పర్యటనలో భాగంగా రెండు కీలక ఒప్పందాలు కుదరగా, వీటిద్వారా విశాఖపట్నంలో సుమారు 35 వేల ఉద్యోగ అవకాశాలు సృష్టించనున్నట్టు వెల్లడించారు.
మంత్రి లోకేశ్ బెంగళూరులో సత్వా గ్రూప్ ప్రతినిధులతో జరిగిన సమావేశం అనంతరం, ఆ సంస్థ విశాఖలో రూ. 1500 కోట్లతో ‘సత్వా వాంటేజ్’ పేరుతో అధునాతన మిక్స్‌డ్ డెవలప్‌మెంట్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ ప్రాజెక్టులో గ్రేడ్-ఏ ఆఫీసులు, ప్రీమియం నివాస గృహాలు ఉండనున్నాయి. దీనివల్ల దాదాపు 25 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
అదే పర్యటనలో, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (GCCs) అభివృద్ధిలో అనుభవం ఉన్న ఎఎన్ఎస్ఆర్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. విశాఖలో 10 వేల ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకుని, ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటు కోసం ఎంఓయూకు (అవగాహన ఒప్పందం) రెండు పక్షాలు సంతకాలు చేశాయి.
ఈ ఒప్పందాలన్నీ ఆంధ్రప్రదేశ్‌ను ఉద్యోగావకాశాల గమ్యస్థానంగా మార్చేందుకు కీలకంగా నిలవనున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

