Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నేడు రాష్ట్రవ్యాప్తంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడలోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ పథకాన్ని ప్రారంభించిన ఆయన, సభలో మాట్లాడుతూ ముఖ్యమైన విషయాలను వెల్లడించారు.
విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన తొలి నిర్ణయమంతా “విద్యాశాఖలో రాజకీయ జోక్యం ఉండకూడదు” అని స్పష్టం చేసిన నారా లోకేశ్, ఈ విషయం పై మరింత వివరణ ఇచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో తమ పార్టీ ఫోటోలు లేదా రంగులు ఉండవని, విద్యార్థులకు ఇచ్చే మెటీరియల్‌లో కూడా తమ పేర్లు ఉండవని ఆయన తెలిపారు. విద్యార్థులకు సమాజంలో మంచి పనులు చేయడానికి స్ఫూర్తిగా నిలిచే వారి పేర్లు పెట్టడమే ముఖ్యమని చెప్పారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో స్కూల్ కిట్లను అందజేశామని, ఇప్పుడు డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించామన్నారు.
“గతంలో ప్రభుత్వ కార్యక్రమాల కోసం విద్యార్థులను తరలించేవారు. కానీ, నేను విద్యాశాఖ మంత్రిగా రాగానే, విద్యార్థులు ఎక్కడికీ వెళ్లకుండా కేవలం చదువుకోవాలని ఆదేశాలు జారీ చేశాను” అని పేర్కొన్నారు. స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో జాబ్ మేళాలు మినహా ఇతర కార్యక్రమాలను నిర్వహించవద్దని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు గతంలో ఎదుర్కొన్న అనేక ఇబ్బందులను గుర్తించిన మంత్రి, యాప్ ల భారం తగ్గించడంపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.