Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడెప్పుడు మొదలు అవుతుందా అని అభిమానులు కొన్ని యేళ్ళుగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి కొత్త సంవత్సరంలో వారి కోరిక తీరింది. జనవరి 2న ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. అయితే దానిని మాత్రం మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. కనీసం ఓ ఫోటో కూడా విడుదల చేయలేదు. దీంతో మహేశ్ బాబు అభిమానులు చాలా గుర్రుగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో అంత సీక్రెసీ ఎందుకునేది వారి మొదటి ప్రశ్న. ఇదే సమయంలో పద్నాలుగేళ్ళ క్రితం మహేశ్ బాబు పోస్ట్ చేసిన ఓ ట్వీట్ ను ఫ్యాన్స్ వెలుగులోకి తీసుకొచ్చారు. 2010లోనే మహేశ్ బాబు… రాజమౌళితో సినిమాను చేయబోతున్నానని ప్రకటిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఆనాటి మాట కార్యరూపం దాల్చడానికి ఇన్నేళ్ళు పట్టిందంటూ వారు దానిని మెన్షన్ చేస్తూ తమ విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా… కొత్త సంవత్సరంలో ఓ శుభవార్త చెప్పిన మహేశ్ అండ్ రాజమౌళి… అధికారిక ప్రకటన చేస్తే… అభిమానుల ఆనందం అంబరాన్ని తాకుతుంది.