Nara lokesh: జగన్‌ పాలన విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించింది 

Nara lokesh: గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర విద్యావ్యవస్థ పూర్తిగా కుంగిపోయిందని, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా జీవితానికీ, వ్యక్తిగత జీవితానికీ అపయశమే తీసుకువచ్చారని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ, “చిన్నప్పుడే పదోతరగతి పత్రాలు ఎత్తుకెళ్లిన వ్యక్తి నుంచి హుందాతనం ఆశించడం మా తప్పే” అని ఆయన ఎద్దేవా చేశారు.

విద్యా రంగాన్ని దెబ్బతీసిన వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ నిర్ణయాలను ఆయన ధ్వజమెత్తారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకం రద్దు చేయడాన్ని గుర్తు చేస్తూ, “ఇలా వ్యవహరించిన మీరు ఇప్పుడు విద్యావ్యవస్థ గురించి మాట్లాడటమే ఘోరం” అన్నారు. ఉపాధ్యాయులను మద్యం దుకాణాల ముందు విధుల్లో పెట్టిన ప్రభుత్వంగా, ఇంకా వారి పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.

జీవో 117 దుష్పరిణామాలు

జీవో 117 వంటి నిర్ణయాల వలన ప్రభుత్వ పాఠశాలల నుంచి సుమారు 12 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లినట్లు లోకేశ్ తెలిపారు. ఏ ఉపాధ్యాయ శిక్షణ లేకుండా, సీబీఎస్ఈ విధానాన్ని వేయి పాఠశాలల్లో ప్రవేశపెట్టడం వల్ల దారుణ ఫలితాలొచ్చాయని చెప్పారు. “మేము నిర్వహించిన పరీక్షలో 90 శాతం మంది విద్యార్థులు విఫలమయ్యారు. ఫెయిల్ అయితే, ముఖ్యంగా ఆడపిల్లల చదువు ఆగిపోతుంది. వివాహాలు జరిపే పరిస్థితి వస్తుంది. అందుకే సీబీఎస్ఈ అమలును వాయిదా వేసాం,” అన్నారు.

అమలుకాని కలల IB విధానం

జగన్ రెడ్డి ఐబీ విధానం తెస్తానని కలలు కన్నా కానీ, దాని అమలు కోసం రూ.5 కోట్లు ఖర్చు చేసినప్పటికీ అమలు చేయలేదని లోకేశ్ విమర్శించారు. టోఫెల్ బోధించగల ఉపాధ్యాయులు లేకపోయినా, ఆ విధానాన్ని తీసుకొచ్చినట్టు ప్రచారం చేయడమూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు – దృష్టికి తీసుకొచ్చిన లోకేశ్

జగన్ పాలనలో రూ.4,500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, గుడ్ల నుంచి చిక్కీల వరకు రూ.1,000 కోట్ల బకాయిలు మిగిలించారని, ఉపాధ్యాయుల బదిలీలకు అప్పటి మంత్రి డబ్బులు వసూలు చేయడం బహిరంగ రహస్యమని ఆరోపించారు. గ్రూప్-1 ప్రశ్న పత్రాల ముద్రణను ప్రైవేట్ రిసార్ట్‌ల్లో, వాచ్‌మెన్‌లతో చేయించడం వంటి ఘటనలను కూడా గుర్తు చేశారు.

ప్రస్తుత ప్రభుత్వం విద్యా రంగ ప్రక్షాళనలో నిమగ్నమై ఉంది

ప్రస్తుత ప్రభుత్వం విద్యా రంగ ప్రక్షాళనకు కట్టుబడి ఉందని, ఉపాధ్యాయుల బదిలీల్లో రాజకీయ ప్రభావం లేకుండా “టీచర్ ట్రాన్స్‌ఫర్ యాక్ట్” అమలు చేస్తున్నామని తెలిపారు. కేజీ నుంచి పీజీ వరకు కొత్త పాఠ్య ప్రణాళిక రూపకల్పన జరుగుతోందని, ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుని లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. పుస్తకాల బరువు తగ్గించి, విలువలతో కూడిన విద్య అందించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు.

పదో తరగతి మూల్యాంకనపై విమర్శలకు సమాధానం

పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంపై వస్తున్న ఆరోపణలను ఖండించిన లోకేశ్, “ఈ ఏడాది మొత్తం 45,96,527 స్క్రిప్టుల మూల్యాంకనం జరిగిందో, రీ–కౌంటింగ్, రీ–వెరిఫికేషన్ తర్వాత కేవలం 11,175 స్క్రిప్టుల్లోనే మార్పులు వచ్చాయి. ఇది కేవలం 0.25 శాతం మాత్రమే. అంటే 99.75 శాతం కచ్చితంగా మూల్యాంకనం జరిగింది” అన్నారు.

2022లో 20%, 2023లో 18%, 2024లో 17% స్క్రిప్టుల్లో తేడాలు వచ్చినప్పటికీ, అప్పటి ప్రభుత్వం వివరాలు వెల్లడించలేదని విమర్శించారు. ఈ ఏడాది తేడాలు గుర్తించిన విద్యార్థులకు జూన్ 10 వరకు ఆర్జేయూకేటీ అడ్మిషన్లలో అవకాశం కల్పించామని, ఇతర కోర్సులకు గడువు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *