Asaduddin owaisi: హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ ప్రాంతం ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యల పట్ల మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన, “పాతబస్తీ ఏం పాపం చేసింది?” అంటూ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కఠినంగా ప్రశ్నించారు.
ఒవైసీ తెలిపిన వివరాల ప్రకారం, ఇటీవల పాతబస్తీలో వరుసగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, దీంతో స్థానికులు భయంతో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పక్కా నివాసాల కొరతతో ప్రజలు తగిన అవసరాలకంటే తక్కువ వసతులతో బతికిపోతున్నారని, తీవ్రమైన సమస్యగా మారిందని పేర్కొన్నారు.
పారిశుధ్య నిర్వహణ కూడా పాతబస్తీలో అత్యంత దయనీయంగా ఉందని వ్యాఖ్యానించిన ఒవైసీ, “ఇరుకైన వీధులు, అధిక ట్రాఫిక్‌తో ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ కనిపించడంలేదు. ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సిగ్నల్స్ సరిగా పనిచేయడం లేదు. పోలీసు అధికారులు ఈ అంశాన్ని నిర్లక్ష్యంగా తీసుకుంటున్నారు” అని మండిపడ్డారు.
రోడ్ల పక్కన చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ జీవనోపాధి పొందుతున్న వారిని ఖాళీ చేయడాన్ని ఒవైసీ తీవ్రంగా తప్పుపట్టారు. “ఈ చిన్న వ్యాపారాలపై లక్షలాది మంది జీవిస్తున్నారు. వారిని ఉపాధి నుంచి వంచిస్తే దొంగతనాలు, దోపిడీలు పెరిగే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రాధాన్యతగా పరిగణించి తక్షణమే నిర్ణయం తీసుకోవాలి” అని కోరారు.
పాతబస్తీ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలనీ, ప్రజల సమస్యలపై సత్వర చర్యలు తీసుకోవాలని ఒవైసీ డిమాండ్ చేశారు. వరుస అగ్నిప్రమాదాలు, నివాస దుస్థితి, పారిశుధ్య లోపాలు వంటి సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆయన కోరారు.