యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల – నేచురల్ స్టార్ నాని కాంబోలో వచ్చిన ‘దసరా’ చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే కాంబో రిపీట్ చేస్తున్నారు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇటీవలే #NaniOdela2 అనే వర్కింగ్ టైటిల్‌తో గ్రాండ్‌గా ప్రారంభించబడింది. దసరా సినిమాలాగే ఇది కూడా తెలంగాణ బ్యాక్‌డ్రాప్ కథ. కథ మొత్తం సికింద్రాబాద్ ప్రాంతంలో సాగుతుందని అంటున్నారు. ఇందులో కథానాయకుడి పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో కథానాయిక పాత్ర కూడా అంతే ముఖ్యం. అందుకే నాకు జోడీగా పాపులర్ హీరోయిన్ ని తీసుకురావాలని అనుకుంటున్నారు.
అయితే ఈ మూవీలో కథానాయిక ఎవరనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ‘దేవర’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ నాని సరసన కథానాయికగా నటిస్తుందని మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇవి కేవలం పుకార్లే అని తేలింది. ఇటీవలే స్త్రీ-2తో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ని ఒప్పించేందుకు యూనిట్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. టాలీవుడ్లో శ్రద్ధాకి ఇది కొత్త సినిమా కాదు.. ‘సాహో’తో ప్రభాస్ సరసన నటించి తెలుగులో మంచి అభిమానులను సంపాదించుకుంది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నట్లు టాక్. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడికానున్నాయి.

