Nandamuri Tejaswini: టాలీవుడ్లో స్టార్ హీరోల కుమారులు హీరోలుగా రాణించడం సహజమే. కానీ, వారి కుమార్తెలు కెమెరా ముందుకు రావడం మాత్రం చాలా అరుదు. సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల హీరోయిన్గా నటించినప్పటి నుంచి ఇంతవరకు పెద్ద స్టార్ హీరోల కుమార్తెలు వెండితెరపై కనిపించడం చాలా తక్కువే. ఎక్కువగా వారు నిర్మాతలుగా, వ్యాపార రంగాల్లో లేదా ఇతర విభాగాల్లో తమదైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
ఇక ఇప్పుడు, నందమూరి కుటుంబం నుంచి ఓ వారసురాలు కెమెరా ముందుకు అడుగుపెట్టింది. ఆమె ఎవరో కాదు – నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు నందమూరి తేజస్విని. ఇప్పటివరకు తండ్రి సినిమాల ప్రొడక్షన్, ప్లానింగ్, మేకింగ్ విషయాల్లో చురుకుగా వ్యవహరించిన తేజస్విని, ఇప్పుడు మొదటిసారి కెమెరా ముందుకు వచ్చారు.
అయితే ఇది సినిమా కాదు, ఓ ప్రసిద్ధ జ్యువెలరీ బ్రాండ్‌కి యాడ్ షూట్. హైదరాబాద్‌లో ఇటీవల ఈ యాడ్ చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ యాడ్‌లో తేజస్విని అందం, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అదరగొట్టిందని సెట్ టాక్. తేజస్విని నేచురల్ యాక్టింగ్, గ్రేస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని యాడ్ టీమ్ చెబుతోంది. త్వరలోనే ఈ జ్యువెలరీ బ్రాండ్ ప్రచారం ప్రారంభం కానుంది.
ఇది కూడా చదవండి: Sreeleela: శ్రీలీలకు మరో బాలీవుడ్ బంపర్ బ్రేక్!
నందమూరి కుటుంబం అంటేనే సినిమా ఇండస్ట్రీలో ఒక గుర్తింపు. ఎన్టీఆర్ నుంచి బాలకృష్ణ, హరికృష్ణ వరకు అగ్రస్థానంలో నిలిచారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, మోక్షజ్ఞ, జానకీరామ్ కుమారుడు వంటి వారసులు హీరోలుగా రాబోతున్నారు. అయితే ఇంతవరకు ఈ కుటుంబం నుంచి ఎవరైనా కుమార్తె కెమెరా ముందుకు రావడం ఇదే మొదటిసారి అన్నది ప్రత్యేకత.
ప్రస్తుతం తేజస్విని, ‘అఖండ 2’ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు, బాలయ్య టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ నిర్మాణ కార్యక్రమాల్లోనూ ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమాల ఎంపిక, మార్కెటింగ్, ప్రొడక్షన్ ప్లానింగ్ల్లో తేజస్విని తనదైన టచ్ చూపిస్తున్నారు.
ఇప్పుడు ఓ యాడ్ ఫిల్మ్ ద్వారా కెమెరా ముందుకు రావడం నందమూరి అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపింది. తేజస్విని ఈ యాడ్‌తోనే కాదు, భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్ట్‌లలోనూ కనిపించే అవకాశం ఉందనే బజ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
నందమూరి వారసత్వంలో తొలిసారిగా ఓ వారసురాలు కెమెరా ముందుకు రావడం నిజంగా ప్రత్యేకం. ఇప్పుడు అందరి చూపు తేజస్విని తదుపరి అడుగులపై నిలిచింది.