Naini Rajendar: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ పరిణామంపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ ఘాటుగా స్పందించారు. కవిత మాటల వెనుక రాజకీయ లాభనష్టాలే కారణమని, పంపకాల పంచాయతీతోనే ఆమె ఈ విధమైన ప్రకటనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
నాయిని మాట్లాడుతూ, కేసీఆర్ కుటుంబ ఆస్తుల లెక్కలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కవిత వద్ద ఉన్న సాక్ష్యాలను సీబీఐకి అందించాలని సూచించారు. కొంతమంది బినామీల పేర్లను మాత్రమే బయటపెట్టిందని, వాస్తవానికి ఇంకా వందల మంది బినామీలు ఉన్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీని ప్రజలు పూర్తిగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
అంతేకాకుండా, మరో ఉద్యమానికి సిద్ధం కావాల్సిన సమయం వచ్చిందని నాయిని రాజేందర్ పేర్కొన్నారు. ప్రజల డబ్బుతో సంపాదించిన అక్రమ సంపదను తిరిగి రాబట్టే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. ‘‘వాళ్లు తిన్న ప్రతి పైసా కక్కిస్తాం’’ అని ఆయన స్పష్టం చేశారు. కవిత చేసిన ప్రకటనలతో కేసీఆర్ కుటుంబం అవినీతిపరమైన చర్యలు ప్రజల ముందు బహిర్గతమయ్యాయని ఆయన అన్నారు.