Nagoba Jathara 2025: దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు ఉన్న నాగోబా జాతరకు గిరిజనం బాటపట్టింది. ఆదిలాబాద్ జిల్లాలోని కేశ్లాపూర్‌లో ఈ రోజు (జనవరి 27) రాత్రి సంప్రదాయబద్దంగా మెస్రం వంశీయులు తీసుకొచ్చిన గంగాజలంతో మహాపూజతో రేపటి (ఈ నెల 28) నుంచి మహా జాతర కొనసాగుతుంది. ఫిబ్రవరి నెల 4వ తేదీ వరకు అంటే 8 రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది. ఈ జాతర కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజనులు తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు.
Nagoba Jathara 2025: కేశ్లాపూర్‌లో గిరిజనుల ఆరాధ్యదైవమైన ఆదిశేషుని నాగోబా జాతర.. సమ్మక్క, సారలమ్మ జాతర తర్వాత ఇదే అతిపెద్దది కావడం విశేషం. మెస్రం వంశస్తులు కాలినడకన బయలుదేరి వెళ్లి వెంట తీసుకెళ్లిన కొత్త కుండలలో కడెం మండలంలోని గొడిసిర్యాల పరిసరాల్లోని గోదావరి నదీ జలాన్ని తీసుకొస్తారు. ఆ జలంతో నాగోబాను అభిషేకిస్తారు. రాత్రి మొత్తం నాగోబా దేవునికి సంప్రదాయబద్దంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
Nagoba Jathara 2025: నాగోబా జాతరకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ జాతర కోసం సుమారు 600 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేసింది. 100 సీసీ కెమెరాలతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఈ జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే కాకుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో గిరిజనులు తరలిరానున్నారు. జాతర బందోబస్తుకు వచ్చిన సిబ్బందికి నిత్యావసర వస్తువులతో కూడిన ఒక ప్రత్యేక కిట్టును అందజేశారు. జాతర మొత్తాన్ని ఆరు సెక్లార్టుగా విభజించి బందోబస్తును ఏర్పాటు చేశారు.
Nagoba Jathara 2025: ఈ జాతర ఉత్సవాలకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షిషా, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కుష్బూ గుప్తా, ఎస్పీ గౌస్ ఆలంం, ఉట్నూరు ఏఎస్పీ కాజల్ తొలుత నాగోబా ఆలయాన్ని దర్శించుకొని జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే దూరప్రాంతాల నుంచి తరలివచ్చిన కొందరు గిరిజనులు ఆలయ సమీపాల్లో ఉండటం విశేషం. ఆలయం వద్ద మెస్రం వంశీయులు, ఇతర అధికారులు, సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.