Nadendla manohar: గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కౌలు రైతులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నారని, అప్పుల బాధలు తాళలేక చాలామంది ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఆదివారం కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ఆ సమయంలో రైతులపై ప్రభుత్వం కనీస శ్రద్ధ కూడా చూపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“జగన్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాలనలో రైతులకు ఎలాంటి భరోసా ఇవ్వలేదు. వేలాది మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం వారిని ఆదుకోవాలన్న చిత్తశుద్ధి చూపలేదు. కన్నెత్తి చూడలేదు కూడా,” అని మంత్రి విమర్శించారు.
జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలోనే 20 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తుచేశారు. వారి కుటుంబాలకు సహాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ధరల స్థిరీకరణ నిధి గురించి గొప్పలు చెప్పిన జగన్ ప్రభుత్వం, ఐదేళ్లలో ఒక్క రూ.50 కోట్లు కూడా రైతుల కోసం ఖర్చు చేయలేదని ఎద్దేవా చేశారు.
పాత ప్రభుత్వం రైతుల పేరుతో కుంభకోణాలు కూడా చేసిందని ఆరోపించారు. “రైతులు నమ్మి ఓటేస్తే… వాళ్లే మోసపోయారు,” అని మనోహర్ మండిపడ్డారు.
ప్రస్తుత ప్రభుత్వం చర్యల్లో
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసిందని ఆయన పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.1,674 కోట్లను వెంటనే విడుదల చేశామని తెలిపారు. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా తేమ శాతంతో సంబంధం లేకుండా కొనుగోలు చేస్తూ రైతులకు సాయం చేస్తున్నామని వివరించారు.
గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికే అదనంగా 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, రైతులకు చెల్లింపులు వేగవంతంగా జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. జగన్ మాత్రం ప్రస్తుతం రాజకీయం కోసం విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
“రైతుల కన్నీళ్లను చూస్తే జగన్ గుండె కరిగేది. కానీ ఆయనకు కౌలు రైతుల ఆత్మహత్యలపై చింత లేదు. ఇప్పుడు చేస్తున్న విమర్శలు తగవు,” అని మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు
ఈ సమావేశంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే పంతం నానాజీ, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

