J. P. Nadda: తెలంగాణలో రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL) ప్లాంట్ లో తయారయ్యే యూరియాను ముందుగా తెలంగాణకే కేటాయించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. ఇప్పటికే కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు లేఖ కూడా రాశారు.
ఈసారి ఖరీఫ్ సీజన్‌కు తెలంగాణకు 10.4 లక్షల టన్నుల యూరియా అవసరం. కానీ కేంద్రం కేవలం 71,773 టన్నులకే ఆమోదం ఇచ్చిందని ఎంపీ ఆరోపించారు. గతేడాదితో పోలిస్తే 45% తగ్గించారని చెప్పారు. పైగా ప్రతి నెలా 60 వేల టన్నులు రావాల్సిన యూరియా, ఈ నెలలో 30 వేల టన్నులు మాత్రమే కేటాయించి.. అందులో కూడా ఇప్పటి వరకు 10 వేల టన్నులు మాత్రమే పంపినట్టు వివరించారు.
రైతుల జీవితాలతో కేంద్రం ఆటలు ఆడుతోందా?
రామగుండం ప్లాంట్ వద్ద 12.7 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా.. తెలంగాణకు తక్కువ కేటాయించడం అన్యాయమని ఎంపీ మండిపడ్డారు. గతేడాది మే నెలలో తయారైన 1.17 లక్షల టన్నుల్లో కేవలం 44,701 టన్నులే రాష్ట్రానికి ఇచ్చారని, మిగిలినది బీజేపీ పాలిత రాష్ట్రాలకు పంపించారని ఆరోపించారు. ఈ ఏడాది కూడా అదే తంతు కొనసాగుతోందన్నారు.
రైతులు కోసమే అందరూ రాజకీయాలా?
ఈ యూరియా సమస్యపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలిద్దరూ రైతులతో రాజకీయాలు ఆడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రం “ఇంత యూరియా తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారు?” అని ప్రశ్నిస్తే, రాష్ట్ర ప్రభుత్వం “కేంద్రం ఇవ్వడం లేదంటూ” చేతులెత్తేసింది. చివరికి మధ్యలో నష్టపోయేది మాత్రం రైతులే. యూరియా కొరతను అవకాశంగా చూసిన దళారులు, వ్యాపారులు యూరియా బస్తాను రూ.266 కి బదులు రూ.400 కి అమ్ముతున్నారు.
యూరియా కొరతకు రైతులే కారణమా?
ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాతో మాట్లాడగా.. “తెలంగాణలో యూరియా వినియోగం ఎక్కువైంది, ఇంత తీసుకెళ్లి ఏం చేస్తున్నారు?” అంటూ ఆయన ప్రశ్నించినట్టు సమాచారం. అంతేకాదు.. “సేంద్రీయ ఎరువుల వాడకాన్ని పెంచండి” అని ఉచిత సలహా కూడా ఇచ్చారు. దీంతో కేంద్రం యూరియా కొరత బాధ్యతను రైతులపైనే నెట్టే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు వచ్చాయి. పైగా, కేంద్ర మంత్రి మాటలు చూస్తే.. తెలంగాణకు కేటాయింపుల్లో కోత ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Betting Apps Case: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్.. విజయ్ దేవరకొండ, రానా సహా 29 మంది సెలబ్రిటీల పై ఈడీ కేసులు నమోదు
సీజన్ మొదలైందాకా కోతలు పెట్టడం ఏంటి?
వానకాలం సాగు ఇప్పటికే ప్రారంభమైంది. ఇలాంటి సమయంలో యూరియా కోతలు పెట్టడం పట్ల రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే నిజమైతే.. సీజన్ మొదలుకాకముందే ముందస్తుగా అర్ధం చేయించి, సేంద్రీయ ఎరువులపై అవగాహన కల్పించాలి. సీజన్ మద్యలో ఎరువులు లేక ఇబ్బంది పెడితే రైతులు ఎలా సాగు చేయాలన్నది పెద్ద ప్రశ్న.
చేతులెత్తేసిన రాష్ట్రం.. రైతులు అల్లాడుతున్నారు
తెలంగాణకు ఈ సీజన్ కోసం కేంద్రం 9.28 లక్షల టన్నుల యూరియాను కేటాయించగా, ఇప్పటివరకు కేవలం 3.35 లక్షల టన్నులు మాత్రమే వచ్చాయి. మిగిలిన 5.93 లక్షల టన్నులు రావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వాటిని తెప్పించడంలో పూర్తిగా విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులు రోజూ యూరియా కోసం పోటెత్తుతుంటే.. ప్రభుత్వం మాత్రం నిశ్శబ్దంగా ఉంది.
బస్తాకు 400.. పోలీస్ పహారాతో పంపిణీ
కొన్ని జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో రైతులు వర్షంలో తడుస్తూ యూరియా కోసం బారులు తీరుతున్నారు. కొన్ని చోట్ల పోలీస్ పహారాతోనే పంపిణీ జరుగుతోంది. సహకార సంఘాల దగ్గర బస్తా రూ.266కి అమ్మినా, ప్రైవేట్ దుకాణాల్లో రూ.310 వరకు అమ్ముతున్నారు. మహారాష్ట్రకు అక్రమంగా తరలించి అక్కడ రూ.400కి విక్రయిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

