Mynampally Hanumanth Rao: మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్ రావు ‘మార్వాడీ హటావో’ నినాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కొంపల్లి మున్సిపాలిటీ ఆల్మైసన్ విల్లాలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. “మనమంతా భారతీయులమే. దేశ పౌరులందరికీ ఎక్కడైనా జీవించే హక్కు ఉంది. ఒకే రాజ్యాంగం, ఒకే పాస్‌పోర్ట్ మనందరికీ ఉంది” అని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌ను ‘మినీ ఇండియా’గా పేర్కొన్న ఆయన, “విదేశాల్లో మన భారతీయులు ఎన్నో ఉన్నత పదవులు నిర్వర్తిస్తున్నారు. అలాగే తెలంగాణ ప్రజలు కూడా దేశంలోని పలు రాష్ట్రాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అలాంటి సందర్భంలో ‘హటావో’ భావజాలం పెరిగితే నష్టపోయేది మనమే, అభివృద్ధి కుంటుపడుతుంది” అన్నారు.
ఇది కూడా చదవండి: ED entry in liquor case: బిగ్ బాస్‌ని పట్టుకునేందుకు పకడ్భంధీగా ప్లాన్?
అలాగే కులాల వారీగా, మతాల వారీగా విభజించుకోవడం దేశ ప్రజలకే నష్టం చేస్తుందని హెచ్చరించారు. “నీవు–నేను కలిస్తేనే మనం. మనం–మనమంతా కలిస్తేనే జనం. ఎక్కడో జరిగిన పొరపాటు ఇక్కడికి రుద్దడం సరికాదు. తప్పు చేసిన వారిని శిక్షించాలి కానీ సమాజంలో విభజనలు సృష్టించకూడదు” అని సూచించారు.
విదేశాల్లో ఉన్న భారతీయుల పరిస్థితిని ఉదాహరణగా ప్రస్తావించిన ఆయన, “అక్కడి వారు మన వారిని వెళ్లగొట్టాలని నిర్ణయిస్తే ఏమవుతుంది? మన అందరి పిల్లలు అక్కడే చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి అందరం సమైక్యంగా ఉండటం తప్పనిసరి” అని పిలుపునిచ్చారు.