Mumbai: ముంబైలో గురువారం రోజున ఓ స్టూడియోలో జరిగిన సంచలన ఘటన తీవ్ర కలకలం రేపింది. నగరంలోని ఆర్ఏ స్టూడియో మొదటి అంతస్తులో సుమారు 20 మంది పిల్లలను బందీలుగా ఉంచినట్లు కేసు నమోదైంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి పిల్లలను సురక్షితంగా రక్షించాయి.
ఆడిషన్ల పేరుతో బంధించారు
యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ, స్టూడియోలో పనిచేస్తున్న రోహిత్ అనే వ్యక్తి ఈ ఘటనకు పాల్పడ్డాడు. పలు నివేదికల ప్రకారం, గత నాలుగైదు రోజులుగా అతను ఆడిషన్లు నిర్వహిస్తున్నాడు. గురువారం రోజున సుమారు 100 మంది పిల్లలు ఆడిషన్ల కోసం రాగా, వారిలో 80 మందిని బయటికి పంపివేశారు. మిగిలిన 20 మంది పిల్లలను ఒక గదిలో బంధించారు. బందీలుగా ఉన్న పిల్లలు భయంతో కిటికీల్లోంచి బయటకు చూడడం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే భారీ సంఖ్యలో పోలీసు బలగాలు, రెస్క్యూ బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. స్టూడియోను చుట్టుముట్టి, హై అలర్ట్ అమలు చేశారు. పోలీసులు వేగంగా స్పందించి, బందీలుగా ఉన్న పిల్లలను క్షేమంగా రక్షించారు. పిల్లలను విడిపించిన అనంతరం పోలీసులు నిందితుడు రోహిత్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Murder: ఉలిక్కిపడ్డ నగరం..అర్థరాత్రి యువకుడిపై కత్తులతో దాడి
కిడ్నాపర్ మానసిక పరిస్థితిపై అనుమానాలు
పోలీసులు విచారణ జరుపుతున్న సమయంలో నిందితుడు రోహిత్ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యపరిచాయి. తాను డబ్బుల కోసం పిల్లలను కిడ్నాప్ చేయలేదని, కొంతమందిని ప్రశ్నించడానికి, వారి నుంచి జవాబులు రాబట్టడానికి మాత్రమే ఈ పని చేశానని అతను చెప్పాడు.
నిందితుడు రోహిత్ తన మానసిక పరిస్థితి గురించి కూడా మాట్లాడాడు. మొదట తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని, కానీ ఆ ప్లాన్‌ను మార్చుకుని పిల్లలను కిడ్నాప్ చేశానని తెలిపాడు. తాను ఉగ్రవాదిని (టెర్రరిస్టును) కాదని కూడా స్పష్టం చేశాడు. నిందితుడి మాటల ఆధారంగా, అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏదేమైనా, ముంబైలోని పోవై ప్రాంతంలో పట్టపగలు జరిగిన ఈ సంఘటన ప్రజల్లో తీవ్ర భయాందోళనలను సృష్టించినా, పోలీసులు సకాలంలో స్పందించి అందరినీ రక్షించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
मुंबई में इस व्यक्ति ने लगभग 20 बच्चों को बंधक बनाया । मानसिक बीमार लग रहा है। उम्मीद करते हैं बच्चे सुरक्षित रहेंगे । पुलिस इसके संपर्क में pic.twitter.com/59EIVK2gkz
— Narendra Nath Mishra (@iamnarendranath) October 30, 2025

