MUMBAI: ముంబై ఎయిర్‌పోర్టులో ఇద్దరు ఐసిస్ అనుమానితుల అరెస్ట్

MUMBAI: దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను అణిచివేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ పరిణామాల్లో భాగంగా, ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న ఇద్దరు అనుమానితులను ఎన్ఐఏ అధికారులు ముంబైలో అరెస్ట్ చేశారు.

శుక్రవారం రాత్రి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండోనేషియాలోని జకార్తా నుంచి వచ్చిన అబ్దుల్లా ఫయాజ్ షేక్ అలియాస్ డైపర్‌వాలా, తల్హా ఖాన్ అనే ఇద్దరు వ్యక్తులు టెర్మినల్ 2 వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని గుర్తించిన ఇమిగ్రేషన్ అధికారులు వారిని అడ్డగించారు. అనంతరం ఎన్ఐఏ రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకుంది.

వీరిద్దరికీ ఐసిస్ స్లీపర్ సెల్‌లతో సంబంధాలు ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారని అధికారులు తెలిపారు. 2023లో మహారాష్ట్రలోని పుణేలో జరిగిన పేలుడు పదార్థాల తయారీ, పరీక్షల కేసులో వీరిద్దరూ ప్రధాన నిందితులుగా ఉన్నారు. అప్పటి నుంచే పోలీసులు వీరి కోసం గాలిస్తున్నట్టు సమాచారం.

ఆ సమయంలో వీరు దేశంలోని ఇతర స్లీపర్ సెల్‌లతో కలిసి ఉగ్ర కుట్రలు రూపొందించారని, బాంబు తయారీకి శిక్షణ కూడా ఇచ్చారని అధికారులు వెల్లడించారు. వీరిద్దరిపై ఒక్కొక్కరికి రూ. 3 లక్షల చొప్పున బహుమతిని కూడా ప్రకటించినట్టు తెలుస్తోంది.

గత రెండు సంవత్సరాలుగా పరారీలో ఉన్న ఈ ఇద్దరు ఉగ్రవాదులు ప్రస్తుతం భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో ముంబైకు ఎందుకు వచ్చారనే కోణంలో ఎన్ఐఏ విచారణ జరుపుతోంది. ఇప్పటి వరకు ఈ కేసుతో సంబంధం ఉన్న 10 మంది ఐసిస్ అనుబంధ వ్యక్తులను ఎన్ఐఏ అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *