DK Aruna: ఫార్మా కంపెనీల ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న లగచర్ల గ్రామానికి. కొడంగల్ ప్రాంతానికి వెళ్తున్న మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణను పోలీసులు అడ్డుకున్నారు. అధికారులపై గ్రామస్థుల దాడి, రైతుల అరెస్టు ఘటన అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ఆమె వెళ్తుండగా, ఆమె కారును మన్నెగూడ చెక్‌పోస్టు వద్ద పోలీసులు నిలిపివేశారు. పోలీసుల తీరుపై అరుణ తీవ్రంగా తప్పుబట్టారు.
DK Aruna: ముఖ్యమంత్రి అన్న తిరుపతిరెడ్డిని గ్రామంలోకి ఎలా అనుమతించారంటూ పోలీసులను డీకే అరుణ ప్రశ్నించారు. నేను ఈ ప్రాంత ఎంపీనని, ప్రజలను కలిసేందుకు ఎందుకు అనుమతించరు? తఇరుపతిరెడ్డి కనీసం వార్డు మెంబర్ కూడా కాదు.. పోలీస్ ఎస్కార్ట్‌తో ఎలా పంపించారు? 144 సెక్షన్ ఉంటే ఆయనను ఎలా పంపారు? నన్నెందుకు పంపరు?.. అంటూ పోలీసులను ఎంపీ డీకే అరుణ నిలదీశారు.
DK Aruna: తన నియోజకవర్గ పరిధిలో తిరిగే హక్కు నాకు లేదా? అని పోలీసులను అరుణ ప్రశ్నించారు. ఈ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాను వెళ్లి తీరాల్సిందేనని భీష్మించుకొని రోడ్డుపైనే కారులో కూర్చొని ఉన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉత్పన్నమవుతాయని పోలీసుల మాటకు ఎంపీ ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి సోదరుడికి లేని లా అండ్ ఆర్డర్ సమస్యలు తాను వెళ్తే వస్తాయా? అని పోలీసులను ప్రశ్నించారు.