Team India: హైదరబాద్ ఏస్ క్రికెటర్ తిలక్ వర్మ 107 నాటౌట్ తో సూపర్ సెంచరీ సాధించడం.. ఆఖరి ఓవర్లలో ఉత్కంఠను తట్టుకుని అదరగొట్టిన అర్షదీప్ అద్భుత బౌలింగ్ తో మూడో ట్వంటీ20లో టీమిండియా విక్టరీ కొట్టింది. తిలక్ వర్మ సూపర్ బ్యాటింగ్ తో మూడో టీ20లో భారత్ 220 పరుగుల లక్ష్యాన్ని విధించగా..సౌతాఫ్రికా జట్టు 7 వికెట్లు నష్టపోయి 208 పరుగులు చేసి పరాజయం పాలైంది. దీంతో భారత్ 11 పరుగులతో గెలిచి సిరీస్ లో 2-1 ఆధిక్యం అందుకుంది.
Team India: సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో భాగంగా మూడో టీ20లో టీమిండియా విక్టరీ కొట్టింది. భారత జట్టులో తిలక్ వర్మ 7 సిక్సర్లు, 8 ఫోర్లతో 107 నాటౌట్ గా నిలిచి కెరీర్ లో తొలి సెంచరీ సాధించాడు. జట్టు కష్ట సమయంలో ఆదుకుని భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. తన బ్యాటింగ్ ప్రతిభకు సంపూర్ణ న్యాయం చేస్తూ చిరస్మరణీయ సెంచరీ సాధించాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసిన సంజు శాంసన్ వరుసగా రెండో సారి డకౌట్ అయ్యాడు. యాన్సెన్ బౌలింగ్ లో పూర్తిగా తడబడుతున్న సంజు.. అతని బౌలింగ్ లో రెండో బంతికే క్లీన్ బౌల్డ్ అయి నిరాశగా పెవిలియన్ చేరుకున్నాడు. ఇక్కడే అనుకోని ట్విస్ట్. కెప్టెన్ సూర్యకుమార్ తాను రాకుండా యువ బ్యాటర్ తిలక్ వర్మను వన్ డౌన్ లో దింపడం కలిసొచ్చింది.
Team India: మరో ఓపెనర్ అభిషేక్ శర్మతో జట్టు కట్టిన తిలక్ వర్మ టీమిండియా ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. వీరిద్దరూ సఫారీల బౌలింగ్ ను ఊచకోత కోశారు. సంజు ఔటైన ఆనందం సౌతాఫ్రికాకు మిగలనీయకుండా పవర్ ప్లేలో పోటీపడీ సిక్స్‌లు, ఫోర్లు బాదారు. దీంతో 8.1 ఓవర్లలోనే భారత్ 100 పరుగులు దాటింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందొచ్చిన తిలక్ వర్మ.. అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. వస్తూనే దక్షిణాఫ్రికా బ్యాటర్లపై దాడి మొదలెట్టాడు. అభిషేక్ రూపంలో అతడికి సరైన భాగస్వామి దొరకడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. పవర్ ప్లే ముగిసేసరికే భారత్ 70/1తో నిలిచింది. 24 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకుని జోరు మీదున్న అభిషేక్ మరో భారీషాట్ కు ప్రయత్నించి 8.4 ఓవర్ల వద్ద స్టంప్ ఔట్ గా వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్‌లోనే కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కేవలం 1 పరుగు మాత్రమే చేసి ఔట్ గా వెనుదిరగడంతో టీమిండియా మళ్లీ కష్టాల్లో పడింది. 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 99 పరుగులతో ఉన్న టీమిండియా 14 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 138 పరుగులతో నిలిచింది.
Team India: ఒకవైపు వికెట్లు పడుతున్నా తిలక్ వర్మ ఆగలేదు. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తిలక్ వర్మ.. అనంతరం హార్దిక్ తో కలిసి సఫారీ బౌలింగ్ పై విరుచుకుపడ్డాడు. 15వ ఓవర్‌లో కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో వరుసగా 4,6,4 కొట్టిన తిలక్.. ఆ తర్వాతి ఓవర్‌లో రెండు సిక్స్‌లు, ఫోర్ కొట్టాడు. ఈ క్రమంలో 19వ ఓవర్ ఐదో బంతికి తిలక్ ఫోర్ బాది టీ20ల్లో తొలి సెంచరీ చేశాడు. వరుస వికెట్లతో ఇన్నింగ్స్ కుదుపునకు గురైన తరుణంలో.. కాస్త తగ్గిన తిలక్ వర్మ ఆఖర్లో టాప్ గేర్లోకి వెళ్లాడు. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న తిలక్ .. మరో 19 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఆఖర్లో డెబుడెంట్ రమణ్ దీప్ సింగ్ కేమియో ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్ లో ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్ గా మలవడంతో పాటు పూర్తి ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయడం ఆకట్టుకుంది. 6 బంతుల్లో 1 ఫోర్, సిక్సర్ తో రమణ్‌దీప్ 15 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో యాన్సెన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కేవలం 4 పరుగులే ఇచ్చాడు. దీంతో తిలక్ మెరుపులతో భారత్ 6 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. 219 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా ముందుంచింది.
Team India: తిలక్ వర్మ సూపర్ సెంచరీతో మూడో టీ20లో భారత్ 220 పరుగుల లక్ష్యాన్ని నిర్దేంచినా.. గెలుపు కోసం కష్టపడక తప్పలేదు. లక్ష్య ఛేదనలో 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టపోయి 84 పరుగులు చేసింది సౌతాఫ్రికా . రికిల్ టన్ 20, హెండ్రిక్స్ 21, స్టబ్స్ 12, మార్ క్రమ్ 29 పరుగులు చేసినా భారత బౌలర్లు వారిని క్రీజులో కుదురుకోనివ్వలేదు. ఈ సమయంలో భారత్ ఈజీగా గెలిచేలా కనిపించింది. కానీ… 22 బంతుల్లో 4 సిక్సర్లు, ఫోర్ తో 41 పరుగులు చేసిన హెన్రిచ్ క్లాసెన్, 17 బంతుల్లో 5 సిక్సర్లు, 4 ఫోర్లతో 54 పరుగులు చేసిన ఆల్ రౌండర్ మార్కో యాన్సెన్ దూకుడైన బ్యాటింగ్‌తో భయపెట్టింది. ఐతే భారత్ ఆ ఉత్కంఠను తట్టుకుంది. ప్రమాదకర క్లాసెన్ ఇచ్చిన ఈజీ క్యాచ్ ను కెప్టెన్ సూర్యకుమార్ జారవిడిచినా..వేగంగా ఆడుతున్న మిల్లర్ ను హార్దిక్ బౌలింగ్ లో అక్షర్ పటేల్ అద్భుత క్యాచ్ తో పెవిలియన్ కు పంపాడు. మిల్లర్ 18 పరుగులు చేశాడు. ఆ తర్వాత క్లాసెన్.. ఎడాపెడా సిక్సర్లతో చెలరేగిపోయాడు. 15 ఓవర్లకు స్కోరు 4 వికెట్ల నష్టానికి 134. చివరి అయిదు ఓవర్లలో దక్షిణాఫ్రికా 86 పరుగులు చేయాల్సివున్నా… క్లాసెన్ దూకుడు భారత్‌ను కలవరపెట్టింది.
Team India: మిల్లర్‌ను హార్దిక్ ఔట్ చేసినా.. బిష్ణోయ్ బౌలింగ్‌లో యాన్సెన్ రెండు సిక్సర్లు బాదడంతో ఆఖరి మూడు ఓవర్లలో దక్షిణాఫ్రికాకు 59 పరుగులు అవసరమయ్యాయి. కానీ 18వ ఓవర్లో 8 పరుగులే ఇచ్చిన అర్షదీప్.. ప్రమాదకర క్లాసెన్‌ను ఔట్ చేయడంతో మ్యాచ్ మళ్లీ భారత్ చేతిలోకొచ్చింది. అయితే కథ అక్కడితో ముగియలేదు. హార్దిక్ వేసిన 19వ ఓవర్లో మూడు ఫోర్లు, రెండు సిర్సర్లతో 30 పరుగులు రాబట్టిన యాన్సెన్.. మ్యాచ్‌ను మళ్లీ ఉత్కంఠగా మార్చేశాడు. ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 25 పరుగులు అవసరమయ్యాయి. అయితే అర్షదీప్ తెలివిగా బౌలింగ్ చేశాడు. అతడు రెండో బంతికి సిక్స్ ఇచ్చినా.. మూడో బంతికి యాన్సెన్‌ను ఔట్ చేయడంతో భారత్ ఊపిరిపీల్చుకుంది. ఆట ఆఖరుకు 208 పరుగులే చేసిన సౌతాప్రికా 11 పరుగులతో పరాజయం పాలైంది. దీంతో మళ్లీ సిరీస్ లో భారత్ ఆధిక్యంలోకి వచ్చింది.