GST reduction

GST Reduction: మిడిల్‌క్లాస్‌కు గుడ్‌న్యూస్.. ఈ వస్తువులపై జీఎస్టీ తగ్గింపు!

GST Reduction:  దేశంలోని మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాలకు కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. నిత్యావసర వస్తువులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తగ్గించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 12 శాతం జీఎస్టీ స్లాబును పూర్తిగా తొలగించడం లేదా అందులో ఉన్న చాలా వస్తువులను 5 శాతం స్లాబులోకి తీసుకురావడంపై కేంద్రం దృష్టి సారించింది. ఈ మార్పుల ద్వారా సామాన్యులపై ఆర్థిక భారం తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ నెల (జూలై 2025) చివరిలో జరగనున్న 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గతంలో, ఆదాయపు పన్ను పరిమితిని రూ.12 లక్షలకు పెంచి మధ్యతరగతికి కేంద్రం ఊరటనిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు జీఎస్టీ రేట్ల తగ్గింపుతో మరోసారి ప్రజలకు ఉపశమనం కల్పించాలనే ఆలోచనలో ఉంది.

ఏ వస్తువులపై ధరలు తగ్గుతాయి?
ప్రధానంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా వాడే వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. ఈ జాబితాలో టూత్‌పేస్ట్, టూత్‌ పౌడర్‌, గొడుగులు, కుట్టు మిషన్లు, ప్రెషర్ కుక్కర్లు, వంటగది పాత్రలు, ఎలక్ట్రిక్ ఐరన్‌లు, గీజర్లు, తక్కువ సామర్థ్యం కలిగిన వాషింగ్ మెషీన్లు, సైకిళ్లు వంటివి ఉన్నాయి. అలాగే, రూ.1000కి పైన ధర కలిగిన రెడీమేడ్ దుస్తులు, రూ.500 నుండి రూ.1000 మధ్య ధర కలిగిన పాదరక్షలు, స్టేషనరీ వస్తువులు, టీకాలు, సిరామిక్ టైల్స్, వ్యవసాయ ఉపకరణాలపై కూడా జీఎస్టీ తగ్గే అవకాశం ఉంది.

Also Read: Iron Heart: ఐరన్ హార్ట్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో సూపర్ హీరో సాగా!

GST Reduction: ఈ మార్పుల వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.40,000 కోట్ల నుండి రూ.50,000 కోట్ల వరకు అదనపు భారం పడొచ్చు. అయితే, పన్నులు తగ్గించడం వల్ల ఆయా వస్తువుల వినియోగం పెరిగి, తద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. దీర్ఘకాలంలో జీఎస్టీ వసూళ్లు కూడా పెరుగుతాయని కేంద్రం అంచనా వేస్తోంది.

జీఎస్టీ రేట్లలో ఏ మార్పు చేయాలన్నా జీఎస్టీ కౌన్సిల్‌లోని అన్ని రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి. ఇప్పటివరకు కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలన్నీ ఏకాభిప్రాయంతోనే జరిగాయి. ఈసారి కూడా రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించడం కీలకం కానుంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా ఇటీవల జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపై సానుకూలత వ్యక్తం చేశారు. మధ్యతరగతికి లబ్ధి చేకూరేలా జీఎస్టీ రేట్లు సరళీకరించాలని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ నెల చివర్లో జరిగే సమావేశంలో ఈ నిర్ణయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *