Cyclone Montha: మొంథా తుపాను ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. రాజధాని హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అంబర్‌పేట, బీఎన్‌రెడ్డినగర్, మహేశ్వరం, జవహర్‌నగర్ వంటి ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
అత్యధిక వర్షపాతం: 20.8 సెం.మీ
వర్షపాతం వివరాలను పరిశీలిస్తే, నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఉప్పునుంతలలో అత్యధికంగా 20.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. నాగర్‌కర్నూల్ జిల్లాలోనే అమ్రాబాద్‌లో 19.7 సెం.మీ, వెల్టూర్‌లో 18.3 సెం.మీ భారీ వర్షం పడింది. ఇక, నల్గొండ జిల్లా తెల్దేవరపల్లిలో 18.5 సెం.మీ, రంగారెడ్డి జిల్లా వెలిజాలలో 13.9 సెం.మీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షాల కారణంగా నాగర్‌కర్నూల్ జిల్లాలోని మంద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీనివల్ల ఎర్రవల్లి-గోకారం, బైరాపూర్‌ల వద్ద రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అచ్చంపేట-శ్రీశైలం ప్రధాన రహదారిపై చంద్ర వాగు కూడా ఉప్పొంగి బ్రిడ్జిపై నుంచి నీరు పారుతోంది. అలాగే, మహబూబ్‌నగర్ జిల్లాలో దుందుభి వాగు ఉగ్రరూపం దాల్చడంతో మిడ్జిల్ మండలం కొత్తూరు-వేలుగోముల మధ్య అనేక గ్రామాలకు దారులు మూసుకుపోయాయి.
Also Read: Flash Flood: సైక్లోన్ మొంథా కలకలం.. తెలంగాణలో 16 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు!
మరికొన్ని జిల్లాలకు హెచ్చరికలు
తుపాను ప్రభావంతో ఇవాళ కూడా రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం వంటి 12 జిల్లాలకు ‘ఆరెంజ్ హెచ్చరికలు’ జారీ చేస్తూ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, హనుమకొండ, జనగామ జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని అంచనా వేస్తూ ‘ఎల్లో హెచ్చరికలు’ జారీ చేశారు.
ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి, ప్రజలు ఎవరూ కూడా ప్రమాదకరమైన వాగులు, వంకల దగ్గరకు వెళ్లొద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

