Mohammad Kaif: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైన నేపథ్యంలో, టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీసుకున్న జట్టు ఎంపికపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కన పెట్టడంపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.తన యూట్యూబ్ ఛానెల్లో కైఫ్ మాట్లాడుతూ.. కుల్దీప్ యాదవ్‌ను ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్‌తో పోల్చడం విశేషం. “ఈ మ్యాచ్ అందరి బౌలర్లకు, ముఖ్యంగా శుభ్‌మన్ గిల్‌కు ఒక పరీక్ష లాంటిది. బ్యాటింగ్ డెప్త్ కోసం ప్రయత్నించిన గిల్.. వికెట్లు తీయగలిగే తన అత్యుత్తమ బౌలర్ అయిన కుల్దీప్ యాదవ్‌ను పక్కన పెట్టాడు,” అని కైఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. షేన్ వార్న్ ఆస్ట్రేలియా పిచ్‌లపై అద్భుతంగా రాణించేవాడు, ఎందుకంటే మణికట్టు స్పిన్నర్లు అన్ని ఫార్మాట్లలో ఇక్కడ ప్రభావం చూపగలరు.
Also Read: SLW vs BANW: మహిళల ప్రపంచ కప్ 2025: బంగ్లాదేశ్‌పై శ్రీలంక సంచలన విజయం
ఆస్ట్రేలియా పిచ్‌లు స్పిన్ కాకపోయినా, వాటిలో ఉండే బౌన్స్‌ను కుల్దీప్ లాంటి బౌలర్లు చక్కగా ఉపయోగించుకోగలరు. కుల్దీప్ను ఆడించకపోవడం చాలా నిరాశ కలిగించింది. జట్టులో నాణ్యత (క్వాలిటీ) కోసం రాజీ పడ్డారు. జట్టులో చాలా మంది పార్ట్-టైమ్ బౌలర్లు ఉన్నారు. నితీష్ కుమార్ రెడ్డి పూర్తి స్థాయి బౌలర్ కాదు. వాషింగ్టన్ సుందర్ కూడా అటువంటి పిచ్‌పై పూర్తి స్థాయి బౌలర్ కాదు. కుల్దీప్ను తప్పించడం అంటే వికెట్ టేకర్ (వికెట్లు తీసే బౌలర్)ను పక్కన పెట్టడమేనని అన్నాడు. కాగా కుల్దీప్ యాదవ్ ఇటీవల అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 2025 ఆసియా కప్‌లో అత్యధికంగా 17 వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.అంతేకాకుండా, వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా 12 వికెట్లతో సత్తా చాటాడు.ఆస్ట్రేలియాపై వన్డేలలో కుల్దీప్కు మంచి రికార్డు ఉంది.