Modi: అమెరికా ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించిన మోదీ

Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఒడిశాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుండి వచ్చిన ప్రత్యేక ఆహ్వానాన్ని తాను వినమ్రంగా తిరస్కరించినట్టు మోదీ వెల్లడించారు.

“జీ-7 సదస్సు కోసం కెనడా వెళ్లిన సమయంలో ట్రంప్‌ గారు ఫోన్‌ చేసి, వాషింగ్టన్ మీదుగా రావాలని కోరారు. తమ మధ్య భేటీ జరిగి, విందులో పాల్గొనాలని సూచించారు. అయితే, జగన్నాథుని క్షేత్రానికి వచ్చే అవకాశం నాకు చాలా ముఖ్యమైనది. అందుకే ఆ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాను,” అని మోదీ అన్నారు.

బీహార్‌లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న అనంతరం మోదీ మధ్యాహ్నం ఒడిశాకు చేరుకొని రోడ్‌ షోలో పాల్గొన్నారు. అనంతరం పూరీలోని బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, “ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ప్రజల ఆశలు నెరవేర్చే దిశగా పనిచేస్తోంది. జగన్నాథ ఆలయంలోని నాలుగు ద్వారాలు మరియు రత్న భండార్‌ను తిరిగి ప్రారంభించడం గొప్ప ముందడుగు,” అని కొనియాడారు.

ప్రధానమంత్రి మోదీ పర్యటనలో భాగంగా రూ.18,600 కోట్ల విలువగల 105 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఒడిశా విజన్ డాక్యుమెంటును ఆవిష్కరించారు. పలు కొత్త రైళ్లకు జెండా ఊపారు. అలాగే ‘లక్షపతి దీదీలు’ సహా పలువురు లబ్ధిదారులను గౌరవించారు.

తాగునీరు, నీటిపారుదల, ఆరోగ్య, రవాణా మౌలిక వసతులు, గ్రామీణ రహదారులు, వంతెనలు, జాతీయ రహదారులు, రైల్వే రంగానికి చెందిన పలు కీలక ప్రాజెక్టుల ప్రారంభం ఈ పర్యటనలో చోటు చేసుకుంది.

గతేడాది జూన్‌లో ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని మోదీ ఈ రాష్ట్రానికి వస్తున్న ఆరోసారి కావడం విశేషం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న సందేశాన్ని ఈ పర్యటన ద్వారా మోదీ స్పష్టంగా తెలియజేశారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *