MLC Elections: హైదరాబాద్ నగరంలోని స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల తంతు బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెండు ప్రత్యేక పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది.
ఈ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి గౌతంరావు, ఎంఐఎం తరఫున మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి బరిలో ఉన్నారు. మొదట్లో ఎంఐఎం ఏకగ్రీవంగా విజయం సాధిస్తుందనే అంచనాలు కనిపించగా, బీజేపీ అనూహ్యంగా రంగంలోకి దిగడంతో ఎన్నిక తప్పనిసరిగా మారింది. ప్రచారంలో బీజేపీ చురుకుగా వ్యవహరించగా, ఎంఐఎం కూడా తన మద్దతుదారులను మెరుగ్గా వినియోగించుకునే ప్రయత్నం చేసింది.
ఇకపోతే, బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని తన కార్పొరేటర్లకు విప్ జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓటింగ్‌లో పాల్గొంటుందని ప్రకటించింది. అయితే, ఈ రెండు పార్టీలు అభ్యర్థులను పోటీలో నిలబెట్టలేదు.
హైదరాబాద్ జిల్లాలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిపి మొత్తం 112 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ప్రస్తుతం పార్టీల బలాబలాలను పరిశీలిస్తే:
-
ఎంఐఎంకు 49 ఓట్లు
-
బీజేపీకు 25 ఓట్లు
-
బీఆర్ఎస్కు 24 ఓట్లు
-
కాంగ్రెస్కు 14 ఓట్లు
ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ పెరుగుతోంది. బీజేపీ పోటీ వల్ల ఎన్నిక రసవత్తరంగా మారినట్టు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఓట్ల సంఖ్యను బట్టి చూస్తే ఎంఐఎం ముందు నిలబడే అవకాశం ఉన్నప్పటికీ, అనూహ్య పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశముంది.